
పది పరీక్షలకు భానుడి సెగ
మదనపల్లె సిటీ : జిల్లాలో మార్చి రాగానే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓ వైపు ఎండల తీవ్రత.. మరో వైపు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతకు భయపడి బయటకు రావాలంటే ప్రజలు హడలిపోతున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంటారు. సక్రమంగా ఆహారం తీసుకోకుండా పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఒక వైపు పరీక్షలు.. మరో వైపు ఎండ వేడిమితో అల్లాడిపోయే విద్యార్థుల ఆరోగ్యం విషయంలోనూ తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిందే మరి.
ఇలా చేయాలి..
ఎండ వేడిమి పెరుగుతుండడంతో విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే నిద్రలేమి, డీ హైడ్రేషన్‌తో బాధపడాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలంటున్నారు. 24 గంటల వ్యవధిలో 8–10 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. ఎండలో వెళ్తే టోపీ, గొడుగు లాంటివి వాడాలి. కళ్ల జోడు పెట్టుకోవాలి. విద్యార్థులు తేలికపాటి, లేత రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం. కూల్ డ్రింక్స్, జ్యూస్‌లు, ఐస్ కలిపిన రకరకాల పానీయాలు తాగొద్దు. ఐస్ శుభ్రంగా లేకపోతే డయేరియా, కలరా, టైఫాయిడ్, పచ్చ కామెర్లు వస్తాయి. బయటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. నూనె పదార్థాలు, వేపుళ్లు, ఉప్పు ఎక్కువ ఉండే జంక్‌పుడ్స్ తీసుకోకూడదు.
ద్రవ పదార్థాలు ఎక్కువగా...
కేవలం నీళ్లు కాకుండా కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం లాంటివి తీసుకుంటే శరీరానికి నీటితో పాటు ఖనిజ లవణాలు అందుతాయి. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. దోసకాయ, కర్బూజ సలాడ్లు ఎక్కువగా తీసుకోవాలి. సొరకాయ, బీరకాయలాంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరలు తీసుకోవడం ద్వారా శరీరంలో డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవచ్చు. కనీసం 7–8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. పోషకాహారం తీసుకోవడం వల్ల పరీక్షలు మరింత బాగా రాయగలుగుతారు.
పరీక్షా సమయంలో జాగ్రత్తలు అవసరం!
పోషకాహారం... తగినంత నిద్ర అవసరం
వైద్యులను సంప్రదించాలి
అధిక జ్వరం, పల్స్ పడిపోవడం, కండరాలు నొప్పులు, తీవ్రమైన నిస్సత్తువ, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే పరీక్ష బాగా రాయగలుగుతారు.
– డాక్టర్ వెంకటరామయ్య,
వైద్యులు, సీహెచ్‌సి,బి.కొత్తకోట

పది పరీక్షలకు భానుడి సెగ
Comments
Please login to add a commentAdd a comment