
పశువైద్య కళాశాలలో ఉద్రిక్తత
ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని గోపవరం సమీపంలోని పశువైద్య కళాశాలలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుపతి పశువైద్య విశ్వవిద్యాలయం వీసీ ఉత్తర్వుల మేరకు ఉదయం 7 గంటలకు కళాశాలలోని విద్యార్థుల హాస్టల్‌ను మూసివేశారు. ఉదయం అల్పాహారం హాస్టల్‌లో తయారు చేయకపోవడంతో పశువైద్య విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ప్రధాన గేట్ వద్ద బైఠాయించి టీచింగ్, నాన్ టీచింగ్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఎవరిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ మహ్మద్ రఫి తన సిబ్బందితో అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి వస్తుందని విద్యార్థులను ఎస్‌ఐ హెచ్చరించారు. దీంతో విద్యార్థులు మెయిన్ గేట్‌ను ఓపెన్ చేశారు. అనంతరం కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసప్రసాద్‌ను పశువైద్య విద్యార్థులు కలిసి వినతి పత్రం సమర్పించారు. కళాశాల హాస్టల్‌ను తెరవాలని కోరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రొద్దుటూరు నుంచి క్యాటరింగ్ ద్వారా విద్యార్థులంతా భోజనాలు తెప్పించుకుని అక్కడే తిన్నారు. అనంతరం శిబిరంలో కూర్చొని యథావిధిగా సమ్మె చేశారు. తమ ఉద్యమాన్ని అణచివేసేందుకే పశువైద్య కళాశాలల్లో హాస్టల్‌ను మూసివేసి అధికారులు బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు.
కళాశాలలో హాస్టల్ మూసివేత
బైఠాయించి నిరసన తెలిపిన విద్యార్థులు

పశువైద్య కళాశాలలో ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment