
ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
రాయచోటి : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 49 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో 13152 మందికి గానూ 12598 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా విద్యార్థులకు తగిన మౌలిక వసతులు కల్పించామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఎం.కృష్ణయ్య తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 11639 మంది హాజరు కాగా 504 మంది గైర్హాజరయ్యారని, అలాగే ఒకేషనల్ పరీక్షలకు 969 మంది హాజరు కాగా 50 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వారు తెలిపారు.
మార్చి 30 నాటికి పక్కా
గృహాలు పూర్తి చేయాలి
– జిల్లా హౌసింగ్ పీడీ శివయ్య
రామాపురం : మార్చి 30 నాటికి జిల్లాలో పక్కాగృహాలను పూర్తి చేయించాలని జిల్లా హౌసింగ్ పీడీ శివయ్య ఆదేశించారు. రామాపురం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 79,721 పక్కాగృహాలు మంజూరు కాగా, 2024 జూన్ నాటికి 33,179 పక్కాగృహాలు పూర్తి అయినట్లు తెలిపారు. రామాపురం మండలం హౌసిగ్ ఏఈగా పనిచేస్తున్న కేఎన్‌ఎం ప్రసాద్‌కు బదిలీ ఉత్తర్వులు ఇచ్చినా ఆఫీసుకు రావడం లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులు శ్రద్ధ చూపి గృహాలు త్వరగా నిర్మించుకోవాలన్నారు. సొంత స్ధలంలో ఇల్లు కట్టుకునే వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జాషువా పాల్గొన్నారు.
విద్యార్థులకు
నాణ్యమైన భోజనం
– డీఈవో సుబ్రహ్మణ్యం
గుర్రంకొండ : డొక్కా సీతమ్మ పథకం కింద విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని డీఈవో సుబ్రహ్మణ్యం అన్నారు. గుర్రంకొండ, ఖండ్రిగ గ్రామాల్లో పాఠశాలల్లో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక ఉర్దూ జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధంగా ఉంచిన భోజనాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల హాజరు రిజిష్టర్ తనిఖీ చేసి ప్రతి విద్యార్థి భోజనం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుడికి సూచించారు. అనంతరం ఖండ్రిగ ఉర్దూ ప్రాథమకోన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఆయన ఎఫ్‌ఎ పరీక్షలు రాస్తున్న విద్యార్థులను కలిసి సిలబస్ గురించి ఆరా తీశారు. కొందరు ఉపాధ్యాయుల పనితీరుపై విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ప్రతి ఉపాధ్యాయుడిపై హెడ్మాస్టర్లు నిఘా పెట్టాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి ఎఫ్‌ఎమ్ శిక్షణపై అడిగి తెలుసుకొన్నారు. సకాలంలో ఆంగన్‌వాడీ కేంద్రాలకు చేరుకొని మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సురేంద్రబాబు, హెడ్మాస్టర్ కమ్మర్‌తాజ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన లక్ష్మీ నరసింహస్వామి బ్రహోత్సవాలకు అంకురార్పణ వైభవంగా జరిగింది. స్వామి బ్రహోత్సవాలు బుధవారం నుంచి లాంఛనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే మూలవర్లకు అభిషేకం, తోమాల సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కలశస్థాపన చేసి వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ స్వస్తివాచనం, పుణ్యాహవాచనం గావించారు. అనంతరం రక్షాబంధనం, మృత్యంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
Comments
Please login to add a commentAdd a comment