వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
చిన్నమండెం : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. చిన్నమండెం మండలంలోని మల్లూరుకు చెందిన ఉస్మాన్‌బాషా కుమారుడు రఫీ(34) ట్రాక్టర్ కింద పడి మృత్యువాత పడ్డాడు. గత పది సంవత్సరాలుగా ట్రాక్టర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న రఫీ దేవగుడిపల్లె గ్రామ పంచాయతీలోని శ్రీ మండెం లక్ష్మీనరసింహస్వామి ఆలయం వెనుక ఉన్న మాండవ్య నదిలో.. ఆదివారం ట్రాక్టర్‌లో ఇసుక లోడు వేసుకుని తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రఫీ ట్రాక్టర్ కిందపడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి వివాహమై ఇద్దరు కుమారులు ఉన్నారు. రఫీ మృతదేహం వద్ద తల్లిదండ్రులు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
లారీ ఢీకొని..
ఓబులవారిపల్లె : బొమ్మవరం అడ్డరోడ్డు జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో ఆర్. వెంకటేష్ (21) అనే యువకుడు మృతి చెందాడు. పుల్లంపేట మండలం అప్పారాజుపేట దళితవాడ గ్రామానికి చెందిన ఆర్.వెంకటేష్ స్కూటర్‌పై తన బంధువుల అబ్బాయి విజయ్‌తో కలిసి కోడూరుకు బయలుదేరాడు. మంగంపేట ఏపీఎండీసీ దాటిన అనంతరం బొమ్మవరం అడ్డరోడ్డు వద్దకు రాగానే వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో వెంకటేష్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విజయ్ తీవ్ర గాయాల పాలయ్యాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
కళాశాల వార్షికోత్సవానికి వెళ్లి వస్తుండగా..
మదనపల్లె : రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి దుర్మరణం పాలైన సంఘటన శనివారం రాత్రి మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని ఎస్టేట్ శివాజీనగర్‌కు చెందిన శ్రీనివాసులు, శ్రీదేవి దంపతుల కుమారుడు సీవీ ఉదయ్‌కిరణ్(20) స్థానికంగా వివేకానంద కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. పుంగనూరు రోడ్డులోని ఆదిత్య కాలేజీలో జరిగిన వార్షికోత్సవానికి హాజరై రాత్రి తిరిగి ద్విచక్రవాహనంలో ఇంటికి వస్తుండగా, మార్గంమధ్యలోని కనుమలో గంగమ్మ గుడి సమీపంలో వాహనాన్ని అదుపుచేయలేక రోడ్డు పక్కన ఉన్న సైన్‌బోర్డును ఢీకొని, ఎగిరి అదే వేగంతో పక్కనున్న బంక్‌పై పడ్డాడు. ప్రమాదంలో తలకు, ముఖంపై తీవ్రగాయాలై అపస్మారక స్థితికి వెళ్లాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
Comments
Please login to add a commentAdd a comment