
కొండను తవ్వి.. ఎలుకను పట్టారు!
గాలివీడు : ‘కొండను తవ్వి.. ఎలుకను పట్టిన’ చందంగా ఉంది.. ఉపాధి హామీ సామాజిక తనికీ బృందం అధికారుల పరిస్థితి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 2023–24 సంవత్సరానికి గాను 17 గ్రామ పంచాయతీల్లో రూ.11 కోట్ల పనులు చేపట్టారు. ఇందులో కేవలం రూ.1,03,633 అవినీతి జరిగినట్లుగా అధికారులు నిర్ధారించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక తనికీ బృందం శ్రమించి తయారు చేసిన నివేదికల్లో డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపించిందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. శనివారం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీఓ జవహర్ బాబు అధ్యక్షతన జరిగిన సామాజిక తనిఖీ నివేదిక బహిరంగ సమావేశానికి అన్నమయ్య జిల్లా ఉపాధి హామీ పీడీ వెంకటరత్నం, ఏపీడీ లోకేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎస్‌ఆర్పీ సుబ్బారావు, ఎస్టీఎమ్ లోకేస్వర్‌రెడ్డి తమ నివేదికలను చదివి వినిపించారు. అందులో భాగంగా పేరంపల్లి రూ.3008, గోపనపల్లె రూ.544, తూముకుంట రూ.4261, ఎగువగొట్టివీడు రూ.1710, గుండ్లచెరువు రూ.14003, కొర్లకుంట రూ.6094, నూలివీడు రూ.10,004, పూలుకుంట రూ.298, వెలిగల్లు రూ.11592, గాలివీడు రూ.12,236, గరుగుపల్లి రూ.3604, పందికుంట రూ.10,518, తలముడిపి రూ.4409, అరవీడు రూ.8614, బొరెడ్డిగారిపల్లి రూ.2,948, సీసీ పల్లి రూ.5,825, గోరాన్ చెరువు రూ.10,165 గ్రామాల్లో అవినీతి జరిగినట్లుగా నిర్ధారించి రికవరీకి ఆదేశించారు. బాధ్యులుగా నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు బాలాజీ, మల్లికార్జున, పురుషోత్తంరెడ్డి, ఖాదర్ బాషాను గుర్తించి, సస్పెండ్ చేశారు. ఈ గణాంకాలను పరిశీలించిన అనంతరం బహిరంగ సభలో ఉన్న ప్రజలు, అధికారులు విస్తుపోవడం వారి వంతయ్యింది. మొత్తంగా ఈ నివేదిక ద్వారా అతి తక్కువ అవినీతి జరిగినట్లుగా, పారదర్శకంగా పనులు జరిగాయని సామాజిక తనిఖీ బృందం తేల్చడం పలు విమర్శలకు తావిస్తోంది. మార్చి 14 నుంచి 27వ తేదీ వరకు జరిగిన ఆడిట్‌లో సామాజిక తనిఖీ బృందం తూతూ మంత్రంగా తనిఖీ నిర్వహించి, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నివేదికలు మరింత బలం చేకూరుతున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పెద్దఎత్తున అవినీతి జరిగినట్లుగా నిర్ధారణకు వచ్చిన ఉన్నతాధికారులు నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లపై వేటు వేసి ఊరుకున్నారే తప్ప.. అవినీతి లెక్కలు తేల్చడంలో తనిఖీ బృందం విఫలమైందన్న విషయం బహిర్గతమయ్యిందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
రూ.11 కోట్ల పనులకు రూ.1 లక్ష అవినీతి జరిగినట్లు నిర్ధారణ
నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లపై వేటు
సామాజిక తనిఖీలో లోపించిన
పారదర్శకత