
మనోహరం.. మోహినీ స్వరూపం
కలికిరి(వాల్మీకిపురం) : పుష్పాలంకృతమైన వాలుజడ, నుదుటన బొట్టు, కాటుక తిలకం.. సాక్షాత్తూ మోహినీ స్వరూపంలో చూడచక్కని శ్రీరామచంద్రుడి దివ్య రూపాన్ని దర్శించుకున్న భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. వాల్మీకిపురం పట్టాభిరాముల వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం విశేష కార్యక్రమాలతో ఆలయ పరిసర ప్రాంతాలలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి మూలవర్లకు నిత్య కై ంకర్యాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. భోగోత్సవ మూర్తులైన శ్రీ సీతారామలక్ష్మణులను విశేష అలంకరణలతో తొలుత ఉదయం సూర్యప్రభ వాహనంపై పురవీధుల్లో నగరోత్సవం నిర్వహించారు. విశేష భక్తజనం, వేద మంత్రోచ్ఛారణల నడుమ స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారి మండపంలో ఊంజల్ సేవ జరిగాయి. సాయంత్రం తిరిగి భోగోత్సవమూర్తులు చంద్రప్రభవాహనంపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. అనంతరం రాత్రి విశేష పూలాలంకృతులతో తీర్చిన పుష్పపల్లకిలో సాక్షాత్తు మోహినీ స్వరూపుడైన పట్టాభిరాముడు పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చాడు. నాయీ బ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టీటీడీ డిప్యూటీ ఈఓ వరలక్ష్మీ, ఏఈఓ గోపినాథ్, సూపరింటెండెంట్ మునిబాల కుమార్, ఆలయ అధికారి కృష్ణమూర్తి, అర్చకులు కృష్ణప్రసాద్, కృష్ణమూర్తి, భక్తులు పాల్గొన్నారు.
నేడు కల్యాణోత్సవం.. గరుడ సేవ
బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, గరుడ సేవ కార్యక్రమాలు అలరించనున్నాయి. కాగా యావత్ దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగ రోజు కల్యాణ వేడుకలు జరుగుతుండగా, వాల్మీకిపురం పట్టాభిరామాలయంలో అమ్మవారి నక్షత్రంలో కల్యాణ వేడుకలు జరుపనుండటం విశేషం.
సూర్య, చంద్రప్రభ వాహనాలపై సీతారాములు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

మనోహరం.. మోహినీ స్వరూపం