వినతులు సరే.. అమలే ప్రశ్నార్థకం | - | Sakshi
Sakshi News home page

వినతులు సరే.. అమలే ప్రశ్నార్థకం

Apr 9 2025 12:27 AM | Updated on Apr 9 2025 12:27 AM

వినతు

వినతులు సరే.. అమలే ప్రశ్నార్థకం

రాజంపేట: రైలు ప్రయాణికుల సమస్యలపై డివిజనల్‌ రైల్వే యూజర్స్‌ కమిటీ సభ్యులు ప్రతిసారి జరిగే సమావేశాలలో విన్నవించడం, ప్రస్తావించడం జరుగుతూనే ఉంది. అమలులో ఏమాత్రం కదలిక లేకుండా పోతోంది. ప్రతిపాదనలన్నీ సమావేశానికే పరిమితం అవుతూ వస్తున్నాయి. కాగా బుధవారం గుంతకల్‌లో డీఆర్‌యూసీసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సారైనా విన్నవించే అంశాలు అమలుకు నోచుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

● డివిజన్‌ కేంద్రమైన గుంతకల్‌ పరిధిలో ఉభయ వైఎస్సార్‌ జిల్లాలోని రైలుమార్గం ఉంది. ఈ మార్గంలో నిత్యం వేలాదిమంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ప్రధానంగా రైళ్ల హాల్టింగ్స్‌ ఇప్పుడు ప్రయాణికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా కొనసాగుతోంది.

మొక్కుబడిగా సమావేశాలు..

నామినేటెడ్‌ కింద ఎంపీలు డీఆర్‌యూసీసీ పదవులకు పేర్లను ప్రతిపాదిస్తారు. వారే డీఆర్‌యూసీసీ సభ్యులుగా కొనసాగుతారు. డీఆర్‌యూసీసీ ఆవిర్భావం నుంచి రైల్వేబోర్డు నిబంధనల మేరకు సమావేశాలను నిర్వహిస్తున్నారు. డీఆర్‌యూసీసీ సభ్యులకు రానుపోను ఉచిత రైలు ప్రయాణంతోపాటు తదితర సౌకర్యాలను కల్పిస్తుంది. సభ్యుల వద్ద నుంచి ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు స్వీకరిస్తుంటారు. ఈ సమావేశాలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారనే అపవాదును రైల్వే మూటకట్టుకుంది.

గుంతకల్‌లో సమావేశం

డివిజన్‌ కేంద్రమైన గుంతకల్‌లో బుధవారం 156వ డీఆర్‌యూసీసీ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు డీఆర్‌ఎం న్యూ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సమావేశం జరుగుతుంది. ఈ మేరకు డీఆర్‌యూసీసీ సభ్యులకు సీనియర్‌ డీసీఎం మనోజ్‌ నుంచి ఆహ్వానాలు అందాయి.

డీఆర్‌యూసీసీ సభ్యులు వీరే...

ముత్యాల శివప్రసాద్‌, ఉదయ్‌కుమార్‌ యాదవ్‌, దినేష్‌ కుమార్‌ జైన్‌, ఎన్‌.రమేష్‌బాబు, శ్రీనువాసులు, విజయకుమార్‌రెడ్డి, సహదేవరెడ్డి, అరవింద్‌కుమార్‌ ఎం.గాంధీ, రాజా వేణుగోపాల్‌ నాయక్‌, టీ.రవి డా.కృష్ణమూర్తి, రాజారెడ్డి, కోటిరెడ్డి, తంబెళ్ల వేణుగోపాల్‌రెడ్డి, తల్లెం భరత్‌ రెడ్డి, జున్న ప్రసాద్‌రెడ్డిలు నియమితులయ్యారు. కర్నూలు, అనంతపురం, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకు చెందినవారు.

ప్రయాణికుల సమస్యలను

పరిష్కరించాలి

రైలు ప్రయాణికులు ఇప్పుడు అనేక సమస్య లను ఎదుర్కొంటున్నా రు. వాటన్నింటి గురించి సమావేశంలో ప్రస్తావించి పరిష్కరించే విధంగా అధికారులలో కదలిక తెప్పించాలి. రాజంపేట, నందలూరు, ఓబులవారిపల్లె లాంటి రైల్వేస్టేషన్లలో అన్ని రైళ్లకు హాల్టింగ్‌ సౌకర్యం కల్పించాలి.

–కేఎంఎల్‌ నరసింహా, న్యాయవాది, రాజంపేట

● రాష్ట్ర అధికారిక రామాలయం ఉన్న ఒంటిమిట్ట రైల్వేస్షేషన్‌ అభివృద్ధి చేయాలి. తిరుమల, వెంకటాద్రి, రాయలసీమ, గుంటూరు, చైన్నె రైళ్లకు హాల్టింగ్‌ ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. ఇటీవల ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి కూడా ఒంటిమిట్టలో రైళ్లకు హాల్టింగ్‌ ఇవ్వాలని రైల్వేబోర్డును కోరిన సంగతి తెలిసిందే.

● ఇంటర్‌ సిటి, నంద్యాల డెమోకు బోగీలు అదనంగా పెంచాలి. బోగీల రద్దీతో ప్రయాణికులు నానా కష్టాలు పడుతున్నారు.

● రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వేకేంద్రంలో కోవిడ్‌–19 ముందు అన్ని రైళ్లకు హాల్టింగ్‌ కొనసాగింది. ఇప్పుడు కేవలం ప్యాసింజర్‌ రైళ్లు, హరిప్రియ, తిరుమల రైళ్లు మాత్రమే ఆగుతు న్నాయి. వెంకటాద్రి, చైన్నె–ముంబాయి మధ్య నడిచే రైళ్లు హాల్టింగ్‌ ఎత్తివేశారు. కోవిడ్‌ ముందు ఏవిధంగా హాల్టింగ్‌ ఉందో అదే విధంగా హాల్టింగ్స్‌ను పునరుద్ధరించాలని ఎప్పటి నుంచో ఎంపీలతోపాటు డీఆర్‌యుసీసీ సభ్యులు రైల్వేశాఖను కోరుతున్నారు.

● నందలూరు నీళ్లకు ఉన్న నాణ్యతను బట్టి రైళ్లకు వాటరింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కోరుతు న్నారు. కోవిడ్‌–19 ముందు రూ.30లక్షల వ్యయంతో వాటరింగ్‌ నిర్మితం చేయాలని సర్వే కూడా చేశారు. ఆ తర్వాత కోవిడ్‌ ప్రభావంతో అటకెక్కించేశారు. ఈ వాటరింగ్‌ సెంటర్‌ వుండటం వల్ల తిరుపతి, రేణిగుంటపై భారం తగ్గుతుంది. ఇదే విషయాన్ని రాజ్యసభలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి ప్రస్తావించిన సంగతి విదితమే.

● జిల్లా మీదుగా మరో ప్యాసింజర్‌ రైలును నడిపించాలని కోరుతున్నారు.

● తిరుపతి –షిర్డి ఎక్స్‌ప్రెస్‌ రైలును డైలీ తిప్పాలని, బెంగళూరుకు వెళ్లేందుకు తిరుపతి వరకు నడుస్తున్న రైళ్లలో ఏదో ఒకటిని కడప వరకు పొడిగిస్తే జిల్లా వాసులకు బెంగళూరుకు వెళ్లేందుకు సులభతరమవుతుందని ప్రయాణికులు కోరుతున్నారు.

● దేశ రాజధాని రైలు కేవలం కడపలో ఆగుతోందని, రాజంపేటలో కూడా ఆపాలని దశాబ్దాలుగా ఎంపీలు కోరుతూ వచ్చారు. ఇటీవల రైల్వేబోర్డు అనుమతి ఇచ్చింది. అయితే అమలు ఇప్పుడు ప్రశ్నార్ధకరంగా మారింది.

● ఆర్‌యూబీలను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే నందలూరు ఆర్‌యూబీ నిర్మాణం వల్ల అనేక అభ్యంతరాలు వస్తున్నాయని, పుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

● వేసవిలో అనేక రైళ్లలో నీటి సమస్యను ప్రయాణికులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్య లేకుండా చూడాలని కోరుతున్నారు.

● గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను రాష్ట్ర రాజధాని అమరావతి వరకు పొడిగించాలనే డిమాండ్‌ ప్రయాణికుల నుంచి వినిపిస్తోంది.

● ఓబులవారిపల్లె నుంచి కృష్ణపట్నం రైలుమార్గంలో ప్యాసింజర్‌ రైలును నడిపించాలని, కడప–విజయవాడకు ఉదయం పూట నడిచే విధంగా రైలును వేయాలని, లేని పక్షంలో గూడూరు జంక్షన్‌ వరకు అయితే డెమో రైలును నడిపించాలని చిరకాలంగా జిల్లా వాసులు కోరుతున్నారు. నెల్లూరు–కడప మధ్య రైలు జర్నీ లేదు. ఈ మార్గంలో రైళ్లను నడిపిస్తే నెల్లూరు–కడప మధ్య రాకపోకలు పెరుగుతాయి. ఇది వ్యాపార, రైతు, విద్యార్ధి పరంగా ఉపయోగకరమని కోరుతున్నారు.

సమావేశానికే పరిమితమా?

డివిజన్‌ స్థాయిలో జరిగే డీఆర్‌యూసీసీ సమావేశంలో నియమితులైన సభ్యులు తమ తమ ప్రాంతాల పరిధిలో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తారు. అవి పరిష్కరించాలని లేఖ ద్వారా ముందుగానే డివిజన్‌ రైల్వే అధికారులకు పంపిస్తారు. అయితే ఆ సమస్యలకు అనేక సాంకేతిక కారణాలను చూపి చేతులు దులుపుకోవడం కొనసాగుతున్న ఆనవాయితీ అనే విమర్శలు ఉన్నాయి. వినతులు సరే, వాటి అమలే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది.

సమస్యలు తీరి రైలు పట్టాలెక్కేనా.!

ప్రతిపాదనలు సమావేశానికేపరిమితమా?

డీఆర్‌యూసీసీ లక్ష్యాలను అధిగమించాలి

నేడు గుంతకల్‌లో డీఆర్‌యూసీసీ సమావేశం

డీఆర్‌యూసీసీ సభ్యులు: 16

వేదిక : గుంతకల్‌ డీఆర్‌ఎం కాన్ఫరెన్స్‌ హాల్‌

సమయం: ఉదయం 11 గంటలు

వినతులు సరే.. అమలే ప్రశ్నార్థకం 1
1/3

వినతులు సరే.. అమలే ప్రశ్నార్థకం

వినతులు సరే.. అమలే ప్రశ్నార్థకం 2
2/3

వినతులు సరే.. అమలే ప్రశ్నార్థకం

వినతులు సరే.. అమలే ప్రశ్నార్థకం 3
3/3

వినతులు సరే.. అమలే ప్రశ్నార్థకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement