
ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి పటిష్ట భద్రత
కడప అర్బన్/ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 11న శుక్రవారం సీతారాముల కల్యాణం నిర్వహించనున్న సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ తెలిపారు. రెండు వేల మందికి పైగా పోలీసులను నియమించామన్నారు. బందోబస్తు విధుల్లో నలుగురు అదనపు ఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 73 మంది సీఐలు, 177 మంది ఎస్‌ఐలు, 1700 మంది పోలీసు సిబ్బంది ఉంటారని తెలిపారు. బుధవారం కడప నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో జిల్లా ఎస్.పి బందోబస్తు విధుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి, ఏ.ఆర్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. అలాగే ఒంటిమిట్ట ఆలయం వద్ద కూడా పోలీసులకు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రించాలన్నారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అదనపు ఎస్పీ (ఏ.ఆర్) బి.రమణయ్య, ఏ.ఆర్. డీఎస్పీ కె.శ్రీనివాస రావు, ఎస్.బి. ఇన్‌స్పెక్టర్ దారెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్.ఐ లు ఆనంద్, వీరేష్, శివరాముడు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రేపు కల్యాణోత్సవానికి ప్రత్యేక బస్సులు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి కల్యాణోత్సవానికి జిల్లా నలుమూలల నుంచి శుక్రవారం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. కడప డిపో నుంచి 35 బస్సులు, పులివెందుల 12, బద్వేలు 22, జమ్మలమడుగు 12, మైదుకూరు 7, ప్రొద్దుటూరు 17, రాయచోటి, రాజంపేట, ఇతర డిపోల నుంచి 40 బస్సులు చొప్పున మొత్తం 145 బస్సులు నడుస్తాయన్నారు. పార్కింగ్ స్థలాల నుంచి కల్యాణోత్సవం జరిగే ప్రాంతం వరకు 20 ఉచిత బస్సులను నడపనున్నామన్నారు.
జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్