
రూ. కోటి విలువ చేసే మందులు పంపిణీకి సిద్ధం
రాయచోటి టౌన్ : జిల్లాలోని 30 మండలాల్లో పశువులకు ఉచితంగా వేసేందుకు సుమారు రూ.కోటి విలువ చేసే మందులు సిద్ధంగా ఉన్నాయని అన్నమయ్య జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్ గుణశేఖర్ పిళ్‌లై తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాలకు కావాల్సిన 200 రకాలకు పైగా పలు రకాల వ్యాధుల నివారణ మందులు అందజేశామన్నారు. ఈ మందులు ఆయా మండల పశువైద్యాధికారులు గ్రామ సచివాలయ పరిధిలోని పశువులకు, గొర్రెలకు, మేకలకు ఉచితంగా వేస్తారని తెలిపారు.
17 వరకు ప్రత్యేక నమోదు శిబిరాలు
రాయచోటి జగదాంబసెంటర్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – కార్మిక శాఖ – ఈ శ్రమ పోర్టల్‌లో ప్లాట్‌ఫాం కార్మికులను, గిగ్ కార్మికుల సమీకరణ, పేర్ల నమోదు కోసం ఈనెల 17వ తేదీ వరకు ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు కార్మిక శాఖ జిల్లా అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికులు ఆన్‌లైన్‌లో లేదా సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్, గ్రామ/ వార్డు సచివాలయాలలో ఉచితంగా నమోదు చేసుకోవచ్చన్నారు.
విద్యార్థి మిత్ర కిట్లు సిద్ధం
సిద్దవటం : జూన్ 12వ తేదీన పాఠశాలలు తెరిచే లోపు విద్యార్థులకు అందజేసేందుకు సర్వేపల్లి రాధాక్రిష్ణ విద్యార్థి మిత్ర కిట్లు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పరిశీలకుడు పీవీకే ప్రసాద్ తెలిపారు. సిద్దవటంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మండల స్టాక్ పాయింట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 15 నుంచి పాఠ్య పుస్తకాలతో పాటు బ్యాగులు, షూస్ వంటివి స్టాక్ పాయింటుకు చేరతాయన్నారు. జూన్ 12వ తేదీ నుంచి ఎంఈఓల ఆధ్వర్యంలో ఎంఆర్‌సీ సిబ్బంది మండలంలోని అన్ని పాఠశాలలకు పంపిణీ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పద్మజ, ఎంఈఓ–2 అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మహిళా
అధ్యక్షురాలిగా నిగార్ సుల్తానా
మదనపల్లె : అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా పట్టణానికి చెందిన నిగార్ సుల్తానా నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న కుటుంబం నుంచి వచ్చిన తనకు కాంగ్రెస్‌పార్టీ అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు.

రూ. కోటి విలువ చేసే మందులు పంపిణీకి సిద్ధం