
అంజనీసుతపై కౌసల్యతనయ
● హనుమంతవాహనంపై రామయ్య విహారం ● తిలకించి..పులకించిన భక్తజనం
ఒంటిమిట్ట : ఏకశిలానగరిలో వెలసిన కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం రాత్రి 7 నుంచి 8:30 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండడగా, మంగవాయిద్యాల నడుమ ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రామయ్య నవనీతకృష్ణాలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం 11 నుంచి 12 వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.
నేటి కార్యక్రమాలు:
బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మోహినీ అలంకారంలో స్వామి వారు భక్తులకు అభయమిస్తారు. రాత్రి 8 నుంచి 9:30 గంటల వరకు గరుడసేవ నిర్వహిస్తారు.
కల్యాణోత్సవ ఏర్పాట్ల పరిశీలన
శ్రీ సీతారాముల కల్యాణోత్సవ ఏర్పాట్లను టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం పరిశీలించారు. టీటీడీ సీఈ సత్యనారాయణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
● శుక్రవారం జరగనున్న సీతారాముల కల్యాణానికి సీఎం చంద్రబాబునాయుడు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వచ్చే మార్గాలను, ఉండే ప్రాంతాలను వైఎస్సార్ జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు.

అంజనీసుతపై కౌసల్యతనయ

అంజనీసుతపై కౌసల్యతనయ