
సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధం
● టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో శుక్రవారం సాయంత్రం సీతారామ కల్యాణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీడీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని పరిపాలన భవనం సమావేశం హాల్‌లో చైర్మన్, ఈఓ జె. శ్యామలరావు, వైఎస్సార్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జేఈఓ వీరబ్రహ్మం, వైఎస్సార్ జిల్లా జేసీ అదితిసింగ్, ఎస్పీ ఈజీ అశోక్ కమార్, సీవీఎస్‌ఓ హర్షవర్దన్ రాజుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సీతారాముల కల్యాణం సందర్బంగా శుక్రవారం సాయంత్రం రారష్ట్‌ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. కల్యాణ వేదిక వద్ద ఉన్న 147 గ్యాలరీల్లో 60 వేల మంది కూర్చొని వీక్షించేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తలంబ్రాల పంపిణీకోసం తొలిసారిగా 28 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.ఎస్వీబీసీ చానల్‌లో స్వామివారి కల్యాణం నేరుగా ఎల్‌ఈడీ స్క్రీన్ మీద ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశామని తెలియజేశారు.
బాంబు స్క్వాడ్ తనిఖీలు
సిద్దవటం: మండలంలోని కనుమలోపల్లె,భాకరాపేట, శివునిపల్లె, బొగ్గిడివారిపల్లె, చాముండేశ్వరీపేట, మాధవరం–1 ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఒంటిమిట్టలో ఈ నెల 11న జరిగే సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కడప జేఎంజే కళాశాల నుంచి ఒంటిమిట్ట వరకు రోడ్డుకు ఇరువైపులా చెత్తకుప్పలు, కల్వర్టులు, అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేశామని బాంబుస్క్వాడ్ పోలీసులు తెలిపారు.