
మంత్రి కనుసన్నల్లో ఇసుక మాఫియా
రాయచోటి అర్బన్ : మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కనుసన్నల్లో జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగిపోతోందని సీపీఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు విమర్శించారు. శనివారం సీపీఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానం అమలులో ఉన్నా జిల్లా ప్రజలకు ఇసుక అందుబాటులో లేకుండా పోయిందన్నారు. ఇసుక మాఫియా మంత్రి అండదండలతో పెద్దఎత్తున ఇసుకను తరలించుకు పోతోందన్నారు. సుండుపల్లె మండలం ఎర్రమనేనిపాళెం వద్ద బహుదానది నుంచి నెల్లూరు ప్రసాద్‌రెడ్డి, రాంబాబు తదితరులు ప్రతిరోజు లక్షల విలువ చేసే ఇసుకను టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారన్నారు. విషయం తెలిసినప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శించారు. సుండుపల్లె – పీలేరు రోడ్డు నుంచి సుమారు 6 కిలో మీటర్ల దూరం వరకు హిటాచీలతో రోడ్డు వేశారంటే ఇసుకారులు ఎంతకు బరితెగించారనేది అర్థమవుతుందన్నారు. ఇప్పటికై నా ఇసుక అక్రమ దందాపై మంత్రి స్పందించాలని, ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు