
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
పెద్దమండ్యం : స్నేహితుని ఊరిలో జరిగే జాతర కోసం వచ్చి సరదాగా ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి మృతి చెందాడు. మండలంలోని కలిచెర్లలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలిచెర్లకు చెందిన అరవింద్ ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షలు రాసి మదనపల్లెలోని ఓ కోచింగ్ సెంటర్‌లో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కోసం కోచింగ్ తీసుకునేందుకు వెళ్లాడు. అక్కడ పెద్దతిప్పసముద్రం మండలం బూర్లపల్లె గ్రామం పిడుమువారిపల్లెకు చెందిన రెడ్డెప్ప కుమారుడు భాస్కర (15), అలాగే తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెకు చెందిన జయప్రకాష్‌రెడ్డితో అరవింద్‌కు స్నేహం కుదిరింది. ఈ నేపథ్యంలో కలిచెర్లలో శుక్రవారం నుంచి పోలేరమ్మతల్లి జాతర ఉండడంతో ముగ్గురు స్నేహితులు కలిచెర్లకు వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు సమీపంలో బండకాడచెరువు వద్దకు వెళ్లారు. ఈత కొడుతుండగా నీరు లోతుగా ఉన్న ప్రాంతానికి వెళ్లిన భాస్కర హఠాత్తుగా నీటిలో మునిగి పోవడం గమనించిన స్నేహితులు కలిచెర్లలో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చారు. నీటిలో మునిగిపోయిన విద్యార్థిని యువకులు గుర్తించి బయటకు తీసి హుటాహుటిన కలిచెర్లలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థి ఆప్పటికే మృతి చెందినట్లు ఆర్‌ఎంపీ డాక్టర్ తెలిపారు. ఘటనపై మృతుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పీవీ రమణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.