కార్మిక కుటుంబంలో విద్యాకుసుమం | - | Sakshi
Sakshi News home page

కార్మిక కుటుంబంలో విద్యాకుసుమం

Apr 15 2025 12:49 AM | Updated on Apr 15 2025 12:51 AM

రామాపురం : పారిశుద్ధ్య కార్మిక కుటుంబంలో విద్యాకుసుమం వికసించింది. మండలంలోని సుద్దమళ్ల పంచాయతీ ఎగువదళితవాడకు చెందిన పూతోక రవణమ్మ, గంగులయ్య దంపతుల కుమారుతు శివశంకర్‌ ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరంలో 973/1000 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. రవణమ్మ రాయచోటి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పని చేస్తోంది. తన కుమారుడిని చదివించుకోవాలనే లక్ష్యంతో రాయచోటి పట్టణంలోని ప్రతిభ జూనియర్‌ కాలేజీలో చేర్పించింది. తమ కష్టాలు కుమారుడికి గుర్తుకు రానివ్వకుండా చదివించింది. తల్లిదండ్రుల ఆశయానికి తగ్గట్టుగా శివశంకర్‌ కష్టపడి చదివి అత్యుత్తమ మార్కులు సాధించి, అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఉచితంగా ఇంటర్‌ విద్యకు అవకాశం

రాయచోటి టౌన్‌ : అర్హత కలిగి ఉండి ప్రతిభావంతులైన బాలికలకు కడప ఆర్తి హోం ఉచితంగా ఇంటర్‌ విద్యను అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్యాట్రన్‌ ఇన్‌ చీఫ్‌ పీవీ సంధ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరాశ్రయులుగా ఉన్న బాలికలకు తమ సంస్థ ద్వారా ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి ఇంటర్‌ విద్యను అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. అర్హత కలిగిన వారు ఆర్తి స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు 8074717196/8331951098/8106123469లకు ఫోన్‌ చేయాలని కోరారు. 10వ తరగతి పూర్తి చేసి, ఆర్థికంగా వెనుకబడిన, నిరుపేద, తల్లిదండ్రులు లేని వారు అర్హులని పేర్కొన్నారు. ఉచిత వసతి, కెరీర్‌ మార్గదర్శనం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 24న సామర్థ్య పరీక్ష నిర్వహిస్తున్నట్లు వివరించారు.

వీరభద్రుడికి పల్లకీ సేవ

రాయచోటి టౌన్‌ : రాయచోటిలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి పల్లకీలో విహరించారు. సోమవారం రాత్రి మూలవిరాట్‌లకు ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించి, పల్లకీలో కొలువు దీర్చారు. ఆలయ ప్రాంగణం, మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు చేపట్టారు. స్థానిక భక్తులతోపాటు ఇతర రాష్ట్రాల భక్తులు కూడా పాల్గొన్నారు.

16,17 తేదీల్లో పరీక్ష

రాయచోటి అర్బన్‌ : రాయచోటి డైట్‌ (జిల్లా విద్యాశిక్షణా సంస్థ)లో అధ్యాపకులుగా పని చేసేందుకు అర్హత కలిగిన ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై నియమించేందుకు ఉద్దేశించిన పరీక్షలు ఈ నెల 16,17 తేదీలలో నిర్వహించనున్నట్లు రాయచోటి డైట్‌ ప్రిన్సిపల్‌ అజయ్‌కుమార్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగరంలోని గాంధీనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రంలో హాజరు కావాలన్నారు. తమ వెంట దరఖాస్తు ప్రతులు, గుర్తింపు కార్డులను తీసుకురావాలని కోరారు. అర్హత కలిగిన స్కూల్‌ అసిస్టెంట్‌లు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు పరీక్షకు హాజరు కావాలన్నారు.

జాగ్రత్తలతో

అగ్ని ప్రమాదాల నివారణ

రాయచోటి టౌన్‌ : ముందు జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాలను నివారించుకోవచ్చని జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌ పేర్కొన్నారు. సోమవారం స్థానిక మాసాపేట వద్ద అగ్నిమాపక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలను తెలిపే కరపత్రాలు, పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో మధుసూదన్‌ రావు, అగ్నిమాపక శాఖ అధికారులు పి.అనిల్‌కుమార్‌, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్మిక కుటుంబంలో విద్యాకుసుమం   1
1/2

కార్మిక కుటుంబంలో విద్యాకుసుమం

కార్మిక కుటుంబంలో విద్యాకుసుమం   2
2/2

కార్మిక కుటుంబంలో విద్యాకుసుమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement