
ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ
నిమ్మనపల్లె : రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఓ ద్విచక్ర వాహనం రోడ్డుపైనే దగ్ధమైన సంఘటన నిమ్మనపల్లిలో గురువారం జరిగింది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు.. మదనపల్లె పట్టణం కొత్త ఇండ్లు ప్రాంతానికి చెందిన వంశీ (28) తన తల్లి, కూతురితో కలసి బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనంపై మదనపల్లి నుంచి నిమ్మనపల్లె మండలం తవళం గ్రామానికి బయలుదేరాడు. రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ గజ్జలవారిపల్లెకు చెందిన హరీష్ కుమార్ రెడ్డి(38), తన స్నేహితుడు మహబూబ్ బాషాతో కలిసి వ్యక్తిగత పనులపై నిమ్మనపల్లెకు వచ్చి, తిరిగి స్వగ్రామానికి వెళుతున్నాడు.
మార్గమధ్యంలో చల్లావారిపల్లె సమీపంలోని మలుపు మిట్ట వద్ద ద్విచక్ర వాహనాలు రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో హరీష్ కుమార్ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా, మహబూబ్ బాషా, మరో వాహనంలోని వంశీ, అతని కుటుంబ సభ్యులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదంలో హరీష్ కుమార్ రెడ్డి నడుపుతున్న బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి రోడ్డుపైనే వాహనం దగ్ధమైంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను 108 వాహనం లో మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్‌ఐ తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఓ ద్విచక్ర వాహనం రోడ్డుపైనే దగ్ధం
వ్యక్తికి తీవ్ర గాయాలు

ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ