
జెడ్పీ చైర్మన్లకు గన్‌మెన్లను తొలగించడం దారుణం
వేంపల్లె : రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీ చైర్మన్లకు గన్‌మెన్లను తొలగించడం దారుణమని జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామ గోవిందరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వేంపల్లెలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా వర్షాలు కురవక తాగునీటి సమస్య అధికంగా ఉందని, వచ్చే జెడ్పీ నిధులతో ఎక్కడా కూడా తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మే 8న జెడ్పీ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో కలెక్టర్‌తో చర్చించి మొదటి ప్రాధాన్యతగా తాగునీటికి ఇవ్వనున్నామని, గత సమావేశాలలో కూటమి ఎమ్మెల్యేలు హాజరై జిల్లాలోని అనేక సమస్యలపై చర్చించకుండా గైర్హాజరు కావడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట, వేంపల్లె, సింహాద్రిపురం, లింగాల తదితర మండలాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందన్నారు. వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.16కోట్లను వేసవికాలంలో తాగునీటికి వినియోగిస్తామని తెలిపారు. ఇప్పటికే వివిధ రకాల పనులకు సంబంధించి రూ.6.కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి, మాజీ మైనింగ్ డైరెక్టర్ వీర ప్రతాపరెడ్డి, వైఎస్సార్‌సీఫీ నాయకులు భరత్ కుమార్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, శ్రీనివాసులు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ ఎం. రామగోవిందరెడ్డి