
బాబు బర్త్‌డే వేడుకలో మారని తమ్ముళ్ల తీరు
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు టీడీపీలో వర్గపోరు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలలో కూడా స్పష్టంగా కనిపించింది. పట్టణంలోని మాజీ ఇన్‌చార్జ్ కస్తూరి విశ్వనాథనాయుడు పార్టీ కార్యాలయం, రాఘవరాజపురంలోని ప్రస్తుత టీడీపీ ఇన్‌చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి పార్టీ కార్యాలయంలో బాబు పుట్టిన రోజు వేడుకలు జరిపారు. వారం క్రితం రాఘవరాజపురంలోని రూపానందరెడ్డి కార్యాలయం వద్ద మంత్రి జనార్దన్ సమక్షంలో జరిగిన ఇరువర్గాల బాహాబాహి రచ్చ వర్గపోరు తారాస్థాయికి చేరింది. ప్రస్తుత ఇన్‌చార్జ్ ఒంటెద్దు పోకడలతో నిజమైన కార్యకర్తలకు ప్రాధాన్యం లేకుండా పోయిందని పలువురు నాయకులు ఆరోపించారు. అలాగే రూపానందరెడ్డి పార్టీ కార్యాలయం అద్దాలు ధ్వంసం చేసి రెండు గంటల పాటు రోడ్డున పడి రభస సృషించారు. దీంతో మంత్రి సైతం బయటకు రాకుండా కార్యాలయం లోపలే ఉండి పోయిన విషయం తెలిసిందే. తాజాగా కోడూరులో వర్గపోరు బాబు జన్మదిన వేడుకలలో కనిపించింది. ముక్కా రూపానందరెడ్డి కార్యాలయంలో ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్, కట్టాబాలాజీ, గుండయ్యనాయుడు, తాతంశెట్టి నాగేంద్ర, గునిపాటి రాయుడు తదితరులు పాల్గొని కేక్ కట్ చేశారు. అలాగే కస్తూరి కార్యాలయంలో మాచినేని విశ్వేశ్వరరావు, మాజీ టీడీపీ అభ్యర్థులు అజయ్‌బాబు, నరసింహప్రసాద్, జనసేన టికెట్ ఆశించి భంగపడిన మనమల భాస్కర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని భారీగా సభ ఏర్పాటు చేశారు. దీంతో బల నిరూపణ చేసినట్లయింది. నియోజకవర్గంలో కుటుంబ పాలన చేస్తూ నిజమైన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు న్యాయం జరగలేదంటూ పలువురు ఆక్రోశం వెలిబుచ్చడం గమనార్హం.
ఎవరికి వారు.. రెండు వర్గాలు కేక్ కటింగ్
కార్యకర్తలలో అయోమయం

బాబు బర్త్‌డే వేడుకలో మారని తమ్ముళ్ల తీరు