
కన్ను పడితే కబ్జా చేయాల్సిందే.!
రైల్వేకోడూరు అర్బన్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఇక్కడి ద్వితీయ శ్రేణి నాయకుల భూ కబ్జాలకు అంతు లేకుండా పోతోంది. అగ్రనాయకుల అండదండలతో ఏటి, వంక, ప్రభుత్వ, ప్రైవేటు లిటిగేషన్ భూములను స్థానిక అధికారుతో కలిసి అడ్డదారిలో ఆక్రమించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నింటిని స్వాహాచేసి విక్రయించిన దాఖలాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతల కన్నుపడితే అది కబ్జా కావాల్సిందే అనే విధంగా పరిస్థితి తయారైంది. అధికారం చేపట్టినప్పటి నుంచి ధన, భూ కబ్జాలపైనే దృష్టి సారించారని పలువురు చర్చించుకుంటున్నారు. కూటమిలో వర్గపోరు ఉన్నప్పటికీ స్వాహా చేసే విషయంలో అన్ని వర్గాలు ఒక్కటవుతున్నాయి. రాఘవరాజపురం సబ్‌స్టేషన్ వద్ద ఆర్‌అండ్‌బీ స్థలం, మైసూరావారిపల్లి ఈద్గా భూమి తంతంగం మరువక ముందే మండలంలోని రెడ్డివారిపల్లి పంచాయతీ పరిధిలో రెడ్డివారిపల్లి బ్రిడ్జి వద్ద గిరిజనుల ఇంటి స్థలాలు, ఏటి పొరంబోకు భూమిపై కొందరి కన్ను పడింది. గతంలో 1997 ఫిబ్రవరి నెలలో 573 సర్వే నంబర్‌లో దరిశా శేషయ్య కొంత భూమిని ఏటి పక్కన ఉండే 15 గిరిజన కుటుంబాలకు అగ్రిమెంటుపై విక్రయించారు. సుమారు 3 దశాబ్దాలుగా వారు గుడిసెలు వేసుకొని మామిడి చెట్లు నాటుకొని జీవనం సాగిస్తున్నారు. కొత్తగా రెడ్డివారిపల్లికి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండడంతో కొందరి కన్ను దీనిపై పడింది. నకిలీ అగ్రిమెంట్లు తయారు చేసుకుని అధికారులతో కుమ్మకై ్క ఎలాంటి నోటీసులు లేకుండా ఎవరూ లేనప్పుడు చెట్లను, గుడిసెలను తొలగించడమే కాక ఆనుకొని ఉన్న ఏటి పొరంబోకు భూమిని, అక్కడి నదిలోని ఇసుక గుండ్రాళ్లను జేసీబీలు, పొకై ్లన్లతో ఎత్తులేపి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
పట్టించుకోని ఇరిగేషన్‌ఽ అధికారులు
తమ ఇరిగేషన్ శాఖ పరిధిలోని గుంజనేటిలో యంత్రాలతో ఇసుక గుండ్రాయి తరలిస్తూ అక్కడే ఉన్న ఇరిగేషన్ పరిధిలోని భూమిని ఎత్తు లేపుతుంటే అధికారులు పట్టించుకోలేదు. ఈ విషయమై డీఈ వినోద్‌కుమార్‌ను వివరణ కోరగా తమ శాఖలో సిబ్బంది కొరత ఉందని, సర్వే జరిపి ఏటి భూమి ఉంటే స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.
రెవెన్యూ అధికారి ఏమంటున్నారంటే..
ఈ సంఘటనపై విచారణ జరపాలని వీఆర్‌ఓను ఆదేశించామని, అలాగే సమగ్రంగా సర్వే జరపాలని మండల సర్వేయర్‌ను ఆదేశిస్తామని తహసీల్దార్ మహబూబ్‌చాంద్ తెలిపారు. ప్రభుత్వ భూమి ఉంటే తప్పని సరిగా చర్యలు తీసుకుంటామన్నారు.
కొత్తకోడూరులో కూటమి నాయకుల పైరవీలు
పట్టణంలోని కొత్తకోడూరు ప్రాంతంలో చాలా మంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకొని నివాసముంటున్నారు. అక్కడ చాలా వరకు కేటాయించని ఇంటి స్థలాలు ఉన్నాయి. అలాగే ఇళ్లు నిర్మించుకోని స్థలాలు ఉన్నాయి. వీటిలో సుమారు 200 వరకు ఇంటి స్థలాలు అధికారులతో కుమ్మకై ్క కొందరు నాయకులు అమ్ముకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మండలంలోని భూ ఆక్రమణలు, దందాలపై ఇక్కడి అధికారుల ప్రమేయం లేకుండా జిల్లా స్థాయి అధికారులతో సమగ్ర విచారణ చేపడితే అసలు విషయాలు వెలుగు చూస్తాయని పలువురు పేర్కొంటున్నారు.
రైల్వేకోడూరు నియోజకవర్గంలో కూటమి నేతల ఆక్రమణల పర్వం
కోట్లు విలువ చేసే భూముల కబ్జాకు యత్నం
నిద్రావస్థలో ఇరిగేషన్,
రెవెన్యూ అధికారులు

కన్ను పడితే కబ్జా చేయాల్సిందే.!

కన్ను పడితే కబ్జా చేయాల్సిందే.!