
నాకు అన్యాయం చేస్తున్నారా అంటూ ఇల్లాలు ఆ భర్తను ఫుల్‌గా తిట్టడం మొదలుపెట్టింది
నెల్లూరు సిటీ: ఇంట్లో సరుకులు అయిపోవడంతో నెల్లూరు సిటీకి చెందిన ఓ ఇల్లాలు తన భర్తకు ఫోన్ చేసింది. ఎక్కడున్నారండీ అంటూ ఫోన్‌లో అడిగింది. భర్త అటునుంచి నేను ‘‘ సెకండ్ వైఫ్’’ దగ్గర ఉన్నానంటూ బదులు ఇచ్చాడు. ఇది విన్న వెంటనే ఇల్లాలు కోపం నషాలానికి అంటింది. నాకు అన్యాయం చేస్తున్నారా అంటూ ఇల్లాలు ఆ భర్తను ఫుల్‌గా తిట్టడం మొదలుపెట్టింది. తిట్టించుకుంటూనే నవ్వడం మొదలుపెట్టాడు ఆ భర్త. అసలు విషయం చెప్పడంతో ఆమె నాలుకర్చుకుంది.
వ్యాపారులు కొత్త ఆలోచనలు.. వెరైటీ పేర్లు..
వ్యాపారులు తమ వ్యాపారం పెంచుకునేందుకు రుచికరమైన ఆహారం తయారు చేయడం... పరిశుభ్రంగా ఉంచడం... తక్కువ ధరలకే ఆహారాన్ని అందించడం.. వంటి ఆలోచనలు చేస్తుంటారు. మరికొందరు వ్యాపార కేంద్రాలకు సరికొత్త పేర్లు పెట్టి కస్టమర్‌లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ప్రయత్నమే ఓ వ్యాపారి చేశారు. నగరంలోని రామ్మూర్తినగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద ‘‘2nd Wife’’ పేరుతో ఫుడ్‌కోర్టును ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో యువతకు ఆ ఫుడ్‌కోర్టు బాగా నోటెడ్ అయింది.
నెల్లూరు నగరంలో కొందరు వ్యాపారులు కూడా ఇదే దారిలో వెళుతున్నారు. రామ్మూర్తినగర్‌లోనే ఓ టీ దుకాణ యజమాని తన షాపుకు ‘‘ఊటీ ’’ పేరును పెట్టారు. ఇలా నగరంలో కొందరు వ్యాపారులు సరికొత్త పేర్లుతో కస్టమర్‌లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాగుంటలేఅవుట్‌లో ‘‘చికెన్ ఎఫైర్’’ రెస్టారెంట్, దర్గామిట్టలో ‘‘బుజ్జిగాడు బిరియానీ’’, వేదాయపాళెంలో ‘‘చోప్ స్టిక్స్’’ రెస్టారెంట్‌లు ఉన్నాయి. ఇలా నగరంలో వ్యాపారులు సరికొత్త పేర్లుతో తమ వ్యాపార కేంద్రాలకు పెట్టుకుంటున్నారు. ప్రజలను కూడా ఈ పేర్లు ఆకర్షిస్తున్నాయి.