నూతన సంవత్సర వేడుకల కోసం గోవా వెళ్లిన స్నేహితులు
అధికంగా చెల్లించాలని డిమాండ్ చేసిన రెస్టారెంట్ సిబ్బంది
యువతితో అసభ్య ప్రవర్తన.. దీనిపై ప్రశ్నించినందుకు విచక్షణారహితంగా దాడి
తాడేపల్లిగూడెం: నూతన సంవత్సర వేడుకలను మిత్రులతో సంతోషంగా జరుపుకుందామని గోవా వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాలు.. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొల్లా రవితేజ(28) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రవితేజతో పాటు మరో నలుగురు యువకులు, ముగ్గురు యువతులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు శనివారం గోవా వెళ్లారు.
రెండు రోజుల పాటు గోవాలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి.. డిసెంబర్ 30వ తేదీ అర్ధరాత్రి నార్త్‌గోవా జిల్లా కలంగూట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. అర్ధరాత్రి అయినందున బిల్లు మీద అధికంగా చెల్లించాలని రెస్టారెంట్ యజమాని డిమాండ్ చేయడంతో.. అక్కడి సిబ్బందికి, రవితేజ స్నేహితులకు మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో తన స్నేహితురాలితో అక్కడి సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించడంతో రవితేజ జోక్యం చేసుకున్నాడు.
వెంటనే రెస్టారెంట్ సిబ్బంది కర్రలతో రవితేజతో పాటు అతని స్నేహితులపై విచక్షణారహితంగా దాడి చేశారు. వెదురు కర్ర విరిగి గుచ్చుకోవడంతో రవితేజ తలకు తీవ్ర గాయమైంది. మిగిలినవారు స్వల్పంగా గాయపడ్డారు. రవితేజను ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రవితేజ స్నేహితులను విచారించారు. దాడి చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment