ద్వాదశ రాశుల గ్రహ కూటమిలో గురు గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గురు గ్రహం బాగుంటే మనకు దాదాపు అంతా బాగున్నట్లే భావిస్తాం. ప్రస్తుత గోచారం ప్రకారం గురుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఏప్రిల్ 13వరకూ కుంభ రాశిలో ఉండే గురుడు.. ఆపై మీనంలోకి వస్తాడు. అంటే ఏప్రిల్ 14వ తేదీ నుంచి గురు సంచారం మీన రాశాలో ఉంటుంది. గురుడు ఒక్క రాశిలో ఉండే కాలం ఏడాది. అంటే ఏడాది పాటు గురుడు మీన రాశిలో ఉంటాడనే చెప్పాలి. ఏప్రిల్ 2వ తేదీ ఉగాది పండుగను జరుపుకున్న క్రమంలో ఈ ఏడాది ఎవరికి ఏ రాశులు ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని తెలుగు పంచాంగం ద్వారా ఇప్పటికే తెలుసుకున్నాం. మరి ఏప్రిల్ 13వ తేదీ దాటిన తర్వాత గురుడు మంచి ఫలితాల్ని ఇచ్చే రాశులు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
వృషభ రాశి- ఈ రాశి వారికి గురుడు 11వ స్థానంలో సంచరించనున్నాడు. అంటే ఇది లాభ స్థానం. జ్యోతిష్య శాస్త్రంలోని రాశి కుండలి ప్రకారం 11వ స్థానాన్ని లాభ స్థానంగా పరిగణిస్తారు. గురుడు మంచి ఫలితాలను ఇచ్చే స్థానాల్లో 11వ స్థానం ఒకటి. దాంతో వృషభ రాశి వారికి ఈ ఏడాది అనుకున్న దానికంటే మంచి ఫలితాల్నే గురు గ్రహం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం, ఉద్యోగం, తలపెట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే వృషభ రాశి వారు ఊహించని విజయాల్ని సొంతం చేసుకుంటారు.
కర్కాటక రాశి- ఈ రాశి నుంచి చూస్తే గురు సంచారం 9వ స్థానం అవుతుంది. గురుడు 9వ స్థానంలో ఉండటం అత్యంత శుభకరమనే చెప్పవచ్చు. గురుడు ఎప్పుడూ 5,7,9 రాశులను చూస్తాడు. అటువంటిది గురుడు 9వ స్థానంలో ఉంటే, అది కూడా తన స్వక్షేత్రమైన మీన రాశిలో ఉండటం కచ్చితమైన మెరుగైన ఫలితాలు ఇవ్వడానికి దోహదం చేస్తుంది. ఇక్కడ గురుడు శుభ దృష్టి కారణంగా(కర్కాటక రాశిని అంటే ఉచ్ఛ స్థానాన్ని చూడటం) వీరి గ్రాఫ్ మరింతగా పెరుగుతుంది. కార్యజయంలో వీరికి తిరుగుండదు.
కన్యారాశి- ఈ రాశి వారికి గురుడు సంచారం ఏడవ స్థానంలో ఉంటుంది. గురుడు సాధారణంగా ఏడో చూపు చూస్తాడు కాబట్టి ఆ స్థానంలో ఉండటంతో పాటు ఆ గ్రహానికి స్వక్షేత్రాల్లో ఒకటైన మీనంలో సంచరించడం శుభ ప్రదమంగా పేర్కొనవచ్చు. ప్రధానంగా కన్యా రాశికి సప్తంలో ఉండటం వల్ల, దాన్ని కళత్ర స్థానం (పెళ్లి, భార్య స్థానాలు)గా చెప్పుకోవడం వల్ల సంసారం జీవితం సాఫీగా అందంగా సాగిపోతుంది. పెళ్లి కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. వీరి మాటకు అత్యంత విలువ కూడా ఉంటుంది.
వృశ్చిక రాశి- ఈ రాశి నుంచి గురుని సంచారం 5లో కొనసాగనుంది. గురు గ్రహం చూసే వీక్షణల్లో ఐదో స్థానం ఒకటి కాబట్టి ఈ రాశి వారు అనుకున్న విజయాలు సాధించి తీరుతారు. పంచమ స్థానం కాబట్టి సంతాన విషయంలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. గురువు సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా ఆర్థిక పరమైన చికాకులు వీడి గాడిలో పడే అవకాశాలు ఎక్కువ.
కుంభ రాశి- కుంభ రాశి వారికి గురుని సంచారం రెండులో ఉండనుంది. అంటే ఇది ధన స్థానం. ధనపరమైన చిక్కులు ధాదాపు తొలగిపోయే అవకాశం. కుటుంబం పరంగా చక్కటి సహకారం అందుతుంది. ఏ పని తలపెట్టినా ముందుకు సాగుతారు. ఆరోగ్య పరంగా సమస్యలు ఏమైనా ఉన్నా దాన్ని జయించగలగడానికి అనుకూల సమయం.
మిథునరాశి- ఈ రాశికి గురుని సంచారం దశమ భావంలో కొనసాగనుంది. గురుడు 10వ స్థానంలో ఉంటే అ వ్యక్తికి సంపదపెరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. సంపన్న జీవితం ఉంటుంది. గృహ యోగం, వాహన యోగం ఈ రాశి వారికి ఉంటుంది. ప్రస్తుతం గురుడు ఈ రాశి వారికి భాగ్య స్థానంలో ఉండటం వల్ల భాగ్యాన్ని ఇచ్చి వెళతాడు. గృహ యోగం, వాహన యోగం అనేది ఇప్పటికే జరిగి ఉంటే ఆపై ఆర్థికమైన పరమైన ఇబ్బందులు ఉండవనే చెప్పాలి.
గురు గ్రహం బలంగా కారణంగా ఈ ఆరు రాశుల వారికి రాజయోగం సిద్ధించే అవకాశం ఉంది.
(గ్రహ ఫలితాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించడం జరిగింది)
Comments
Please login to add a commentAdd a comment