శని గ్రహం.. నవ గ్రహాలలో అత్యధిక ప్రాధాన్యత ఉన్న గ్రహమనే చెప్పాలి. ఎందుకంటే మిగతా గ్రహాలు ఫలితాలు వారి చూసే చూపుల్ని బట్టి ఒక్కోసారి శుభాశుభ ఫలితాలు వస్తే, శని గ్రహం మాత్రం కచ్చితమైన ఫలితాల్ని ఇస్తాడనే జ్యోతిష్యం చెబుతుంది. చాలామందికి శని గ్రహం అంటే చెడు సంకేతంగా భావిస్తారు కానీ అది వాస్తవం కాదని శాస్త్రం చెబుతోంది. శని గ్రహం మంచిని కానీ, చెడు కానీ ఒకే రకంగా ఇస్తాడు.
ఆ గ్రహం శుభ స్థానంలో ఉంటే శుభ ఫలితాన్ని, చెడు స్థానంలో చెడు ఫలితాన్ని కచ్చితంగా కలగజేస్తాడు. అందుకే శని గ్రహ సంచారం మారితే ఎలా ఉంటుందో అనే సందిగ్ధం జ్యోతిష్యం నమ్మివారిని ఎక్కువ కలవర పరుస్తూ ఉంటూంది. శని సాధారణంగా 3, 6, 7, 10 స్థానాల్లో ఉంటే మంచిది అని చెబుతారు. ఆ స్థానాల్లో శని ఉంటే మంచి జరుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది. అసలు ఈ ఏడాది శని గ్రహ ప్రభావంతో ఎవరికి యోగం కలుగుతుందో ఒక్కసారి చూద్దాం.
ఈనెల(ఏప్రిల్) 29వ తేదీన శని గ్రహం సంచారం మారుతుంది. ఆ తేదీన శని గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఆయన స్వక్షేత్రం(సొంత ఇల్లు). అంతకుముందు వరకూ మకర రాశిలో ఉన్నాడు శని. ఇది కూడా శనికి సొంత ఇల్లే .అంటే శనికి రెండు ఇళ్లు అన్నమాట. మకర రాశి నుంచి అంటే సొంత ఇంటి నుంచి అతని సొంత ఇళ్లు అయిన కుంభంలోకి శని వస్తున్నాడు. దాంతో కొన్ని రాశుల వారికి ప్రయోజనం ఉండనుంది.
వీటిలో వృషభ రాశి ఒకటి. వృషభ రాశి వారికి శని తన స్థానాన్ని మార్చుకోవడం వల్ల యోగం పట్టే అవకాశం ఉంది. శని గ్రహం అనుగ్రహంతో వృషభ రాశి వారికి అదృష్టం మారనుంది. ఏప్రిల్ 29వ తేదీన వృషభ రాశి వారికి దశమంలోకి శని రావడంతో వారి దశ మారనుంది. వీరు ఆర్థిక పురోగతిని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారం, ఉద్యోగ విషయాలలో కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది.
సింహ రాశి.. ఈ రాశి వారికి కూడా శని గ్రహం అనుగ్రహం ఉండనుంది. వీరికి సప్తమ శని వల్ల యోగం సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి జీవితాల్లో మార్పులతో పాటు ఆర్థిక ప్రగతి కూడా సాధిస్తారు. ఉద్యోగస్తులు ఊహించని ఫలితాలు కూడా చూస్తారు. అలానే ఈ రాశిలో వ్యాపారస్తులు కూడా అనుకోని విజయాన్ని పొందుతారు.
కన్యా రాశి..
ఈ రాశి వారికి శని సంచారం ఆరు అవుతుంది. అంటే వీరు కూడా అదృష్టవంతులనే చెప్పాలి. సింహ రాశికి పక్కనే కన్యా రాశి వారికి శని గ్రహ సంచారం వల్ల ఏప్రిల్ 29వ తేదీ నుంచి కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా అప్పులు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే అవి శని గ్రహ మార్పుతో తొలగిపోయి ఊపిరి తీసుకునే అవకాశం ఉంది. కన్యా రాశి వారు ఊహించిన విజయాలు శని గ్రహ మార్పుతో చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
ధనస్సు రాశి..
ఈ రాశి వారికి శని సంచారం వల్ల గతం కంటే మెరుగ్గా వారి జీవితం సాగే అవకాశం ఉంది. ప్రధానంగా ధన లాభంతో పాటు ఏమైనా చిక్కులు ఎదురైనా అవి వీరిపై పెద్దగా ప్రభావం చూపలేవు. విద్యార్థులు, ఉద్యోగులు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
శని గ్రహం ఒక్కో ఇంట్లో రెండున్నరేళ్లు ఉంటాడు. అంటే కుంభంలో రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత తన గమనాన్ని మార్చుకుంటాడు. అంటే మొత్తం 12 రాశుల్ని శని చుట్టి మళ్లీ ఇప్పుడు స్థానానికి రావాలంటే 30 ఏళ్లు పడుతుంది.
పైన చెప్పింది శని గ్రహం అనుకూలంగా ఉన్న రాశులకు మాత్రమే. అలా అని మిగతా రాశులు బాలేదని కాదు. వేరే గ్రహాల ప్రభావంతో తక్కిన రాశులు ఫలితాలు ఆధారపడి ఉంటాయి. వేరే గ్రహాల వీక్షణ బాగున్న వాళ్లు మంచి ఫలితాల్ని చూస్తారు.
(గ్రహ ఫలితాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించడం జరిగింది)
Comments
Please login to add a commentAdd a comment