
మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి, చిత్రంలో ఎంపీ సురేష్, ఎమ్మెల్యే కోన
బాపట్ల: బాపట్ల జిల్లా ఆవిర్భావ వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేళ తాళాలు, కోలాట నృత్యాలు, నెమలి నృత్య ప్రదర్శన, డప్పు కళాకారులు, వాయిద్య కళాకారుల ప్రదర్శనలు పట్టణ ప్రజలను అబ్బురపరిచాయి. రథంబజారులోని భావనారాయణస్వామి దేవాలయం వద్ద నిర్వహించిన సంబరాలకు అశేష జనం హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కె.విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి కుటుంబ సమేతంగా భావనారాయణస్వామికి పొంగలి నివేదించారు. ముందుగా కుంభమేళాతో దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం జిల్లా అధికారులను ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులను అధికారులు సత్కరించారు.
రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్, అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. బాపట్ల జిల్లా ఏర్పాటుతో ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. నిజాంపట్నం పోర్టు రెండవ దశ విస్తరణ, అభివృద్ధి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. చీరాల ఓడరేవు నిర్మాణం, తీర ప్రాంతాల అభివృద్ధితో జిల్లా పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోనుందని వివరించారు. అభివృద్ధికి అవసరమైన సహజ వనరులన్నీ జిల్లాలో పుష్కలంగా ఉన్నాయని అభివర్ణించారు. జిల్లా ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నా రు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ పేదరికంలో ఉన్న వారిని స్థితిమంతులుగా చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు.
ఒకసారి ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ముఖ్యమంత్రి జగన్ మరిచిపోరని అన్నారు. ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్ల జిల్లా అభివృద్ధి వైపు ముందుకు సాగుతోందని అన్నారు. బాపట్లకు త్వరలో కొత్తగా రైల్వేలైన్ రానుందన్నారు. ప్రజల ఆకాంక్షలు, కలలు సాకారం అయ్యాయని, ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. జిల్లా ఆవిర్భావం అనంతరం జిల్లా యంత్రాంగం చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ కె.విజయకృష్ణన్ మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేస్తే బాపట్ల జిల్లా మరింత పురోభివృద్ధిలో పయనిస్తుందని అన్నారు. ప్రజలకు సేవలందించడం, మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు చేసిన కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ శాంతిభద్రతలకు ఎలాంటి విఘా తం కలగకుండా ప్రజలంతా సహకరించారని అన్నారు.
ప్రజలు ప్రశాంతంగా జీవించే వాతావరణ కల్పించడానికి పోలీసు యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందన్నారు. జేసీ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ చుక్కల భూముల కింద తొమ్మిది వేల ఎకరాల భూములను గుర్తించి హక్కుదారులకు పూర్తి హక్కులు కల్పించేలా నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించా మని తెలిపారు. చీరాల–చిలకలూరిపేట, నిజాంపట్నం–బుడంపాడు వరకు రెండు జాతీయ రహదారులు జిల్లాకు వస్తున్నాయని చెప్పారు. జిల్లా అభివృద్ధిలో అధికారులు, ప్రజాప్రతితులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన గరటయ్య, చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌బాబు, బుడా చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, బుడా వైస్‌చైర్మన్ ఏ.భానుప్రతాప్, జిల్లా రెవెన్యూ అధికారి కె లక్ష్మీ శివజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment