చీరాల: నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చీలికలు, పేలికలుగా మారింది. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా తెలుగు తమ్ముళ్లు ప్రత్యేక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓ వర్గానికి పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న ఏలూరి సాంబశివరావు పరోక్షంగా మద్దతు తెలపడంతో విభేదాలు కాస్త వేరు కుంపట్లకు దారితీసింది. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టి ఎంఎం కొండయ్య రెండేళ్లు అవుతుంది. ఆయన పార్టీ కార్యక్రమాలు ఇన్‌చార్జి హోదాలో చేస్తున్నప్పటికీ పోటీ కార్యక్రమాలు, కుల సమావేశాలు చేస్తుండడంతో తాను పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టి పార్టీని నిలబెడుతున్నానని, కాని అధినేతతో పాటు పార్టీ అధిష్టానం చీరాలలో ఎటూ తేల్చకుండా వర్గ విభేదాలను ఫుల్‌స్టాప్ పెట్టకపోడంతో ఆయన పార్టీ నాయకుల వద్ద అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సొంత సామాజిక వర్గం నుంచి..
ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీకి చెందిన సొంత సామాజికవర్గం రంగంలోకి దిగింది. చీరాల సీటు కారంచేడుకు చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐకు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. దీనిలో అసలు పార్టీ క్యాడర్ దూరమై సతమతమవుతుంటే పోటీ కార్యక్రమాలు టీడీపీని అతలాకుతలం చేస్తున్నాయి. అలానే చీరాలలో టీడీపీ సీటు ఆశిస్తున్న ఆశావహులకు పొన్నూరుకు చెందిన ఓ వ్యక్తి లోకేష్‌కు అంతరంగికుడినంటూ లోకేష్ ద్వారా సీటు ఇప్పిస్తానని చీరాలలోని ఆశావహుల వద్ద కోటి రూపాయల వరకు వసూలు చేశారు. ఆశపడిన ఆశావహులు అతడికి ఎక్కువ మొత్తంలో నగదు ముట్టజెప్పారు. పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో జరిగే ‘రా కదిలిరా..’ కార్యక్రమంలో చీరాల సీటుపై చర్చ జరిగే అవకాశం ఉంది.
చీరాల సీటుపై లోకేష్ చిచ్చు..
చీరాల, మంగళగిరి సీట్లుకు లింకు కాస్త చీరాలలో టీడీపీలో కులాల కుమ్ములాట్లకు దారితీసింది. లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తుండడంతో అక్కడ చేనేతలు అధికంగా ఉండడంతో అక్కడ ఎలాగైనా గట్టెక్కేందుకు లోకేష్ చీరాల సీటును ఎరగా వేస్తున్నారు. తాను మంగళగిరిలో పోటీ చేస్తుండడంతో చేనేతలలోనే దేవాంగులకు గాని, పద్మశాలీయులకు గాని ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు లోకేష్‌ను కలుస్తున్న చేనేత నాయకులకు భరోసా ఇస్తున్నారు. పార్టీ అధినేత మాత్రం ప్రస్తుతం బీసీలకు ఇవ్వాలని అనుకుంటుండగా చీరాలలో చేనేతలకు సీటు ఇస్తే తాను మంగళగిరిలో బయటపడతానని లోకేష్ అంటున్నట్లుగా సమాచారం.
దీంతో కొంత కాలంగా చీరాలలో చేనేత వర్గానికి చెందిన డాక్టర్ సజ్జా హేమలత, మునగపాటి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ మాజీ గుద్దంటి చంద్రమౌళి, మంగళగిరి ప్రాంతానికి చెందిన కాండ్రు శ్రీనివాసరావు, చాట్రాసి రాజేష్, చీరాలలో ఇప్పటికే తమ సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహించారు. లోకేష్‌ను తరచూ కలుస్తున్నారు. సీటు నాకంటే నా అంటూ ప్రచారం కూడా మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే డీఎస్పీగా పనిచేస్తూ ప్రస్తుతం సెలవులో ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన కొమ్మనబోయిన నాగేశ్వరరావు గత రెండు నెలలుగా చీరాల నియోజకవర్గంలో తిరుగుతూ యాదవ గ్రామాల్లో పర్యటిస్తూ తానే పోటీ చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఈ తతంగం జరుగుతున్నప్పటికీ పార్టీ అధిష్టానం చీరాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఇన్‌చార్జిగా ఉన్న ఎంఎం కొండయ్య కూడా పూర్తి అసహనంగా ఉంటున్నారు. ఇక లాభం లేదని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment