సంజీవయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
బాపట్లటౌన్: పేదల అభ్యున్నతి కోసం ఆహర్నిశలు శ్రమించిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. రాష్ట్రంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిలో భాగంగా శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ కర్నూలు జిల్లా, కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో ఓ సామాన్య నిరుపేద దళిత కుటుంబంలో మునెయ్య, సుంకలమ్మ దంపతులకు 1921 ఫిబ్రవరి 14న దామోదరం సంజీవయ్య జన్మించారన్నారు. స్వగ్రామంలో 4వ తరగతి వరకు చదివి కర్నూలులోని అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ పాఠశాలలో విద్యను అభ్యసించి, కర్నూలు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో చేరి 1938లో ఎస్‌ఎస్‌ఎల్‌సీలో జిల్లాలోనే ప్రథమునిగా ఉత్తీర్ణుడయ్యాడన్నారు. సంజీవయ్యకు చదువు పట్ల అమితమైన ఆసక్తిని గుర్తించిన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సంజీవయ్య చదువులో ఒక్కో మెట్టు ఎక్కుతు మద్రాస్‌లో న్యాయవిద్యను అభ్యసించారన్నారు. పిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి ప్రవేశించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్‌లో పలు మంత్రి పదవులు చేపట్టారన్నారు. 38 సంవత్సరాల పిన్న వయస్సులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. 1960లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి దళిత ముఖ్యమంత్రిగా కీర్తినీ ఆర్జించారన్నారు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన నిస్వార్ధ రాజకీయ నాయకుడు సంజీవయ్య అన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ ఘనుడు దామోదరం సంజీవయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్, ఏ.ఓ శ్రీనివాసరావు, ఏ.ఆర్ డీఎస్పీ విజయసారధి, ఎస్‌బీ సీఐ నారాయణ, ఆర్‌ఐ మౌలుద్దీన్ పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ
Comments
Please login to add a commentAdd a comment