వారమే సమయం.. నత్తేనయం!
నరసరావుపేట రూరల్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈనెల 26వ తేదీన కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్ల మహాత్సవానికి వారం రోజులే సమయం ఉంది. ఏకాదశి ముందురోజు ఆదివారం కావడంతో ఈనెల 23 నుంచే కోటప్పకొండకు భక్తుల రాక ప్రారంభమవుతుంది. తిరునాళ్ల ఏర్పాట్లపై నెలరోజుల నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నా కీలకమైన శాఖలు ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. ఆలయ ప్రాంగణంలో రంగులు వేసే పనే ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కొండ దిగువున బారికేడింగ్, లైటింగ్, మరుగుదొడ్లు, తాగునీరు వంటి పనులపై అధికారులు ఇప్పటివరకు దృష్టిపెట్టలేదు. కొండకు వచ్చే రహదారుల్లో మరమ్మతులు ఇప్పటివరకు ప్రారంభించలేదు.
దగ్గర పడుతున్నా చలనం ఏదీ..?
కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే లక్షలాది మంది యాత్రికుల కోసం ప్రభుత్వ శాఖలు విస్త్రృత ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇందుకోసం నెలరోజుల నుంచే జిల్లా అధికారులతో పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. అయితే తిరునాళ్లకు సమయం దగ్గర పడుతున్నా పలు శాఖల్లో చలనం కనిపించడం లేదు. కొండ దిగువున శివరాత్రి రోజు రాత్రి జాతరకే లక్షలాది మంది తరలివస్తారు. ఈ ప్రాంతంలో యాత్రికులకు అసౌకర్యం కలగకుండా పనులు చేపట్టాల్సి ఉంది. కొండ దిగువున ప్రధాన రహదారి వెంట బారికేడ్లు ఏర్పాటు చేసే పనిని ఆర్‌అండ్‌బీ నిర్వహించాల్సి ఉంది. ఈ పనులు ఇంకా ప్రారంభించలేదు. ప్రధాన రహదారులతో పాటు భక్తులు స్నానాలు ఆచరించే చిలకలూరిపేట మేజర్ కాలువ వద్ద విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేయాలి, ఆర్‌అండ్‌బీ (ఎలక్ట్రికల్) శాఖ దీనిని చేపటాల్సి ఉండగా పనులు ప్రారంభం కాలేదు. యాత్రికులకు తాగునీటి సమస్య తలెత్తకుండా నీటి కుళాయిలు ఏర్పాటుతో తాత్కాలిక మరుగుదొడ్లను ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ నిర్వహిస్తోంది. ఆయా పనుల్లో పురోగతి కనిపిండచం లేదు. ప్రభుత్వ శాఖల స్టాల్స్, పోలీసు ఉన్నతాధికారుల తాత్కాలిక వసతి కోసం సిద్ధం చేసే మైదానాన్ని ఇప్పటివరకు శుభ్రం చేయకపోవడంతో పిచ్చిమొక్కలతో దర్శనమిస్తుంది.
ఆలయ ప్రాంగణంలో పరిస్థితి..
కొండ మీద ప్రధానాలయం కాకుండా ఇతర ఆలయాలకు రంగులు వేసే పనిని నెల రోజుల క్రితం ప్రారంభించారు. ఈ పనులు ఇంకా సాగుతున్నాయి. క్యూలైన్‌లకు మరమ్మతులు చేపట్టి రంగులు వేయడం పూర్తయింది. ఽఆలయ ప్రాంగణంలోని ఆర్చీకి రంగులు వేస్తున్నారు. పార్కింగ్ ప్రాంతంలో ఉన్న క్యూలైన్‌లకు తాటాకు పందిరి ఏర్పాటు చేస్తున్నారు.
తిరునాళ్ల పనుల్లో
కనిపించని పురోగతి
23 నుంచి కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం
కొండ దిగువున పనులు ప్రారంభించని పలు శాఖలు
ఏర్పాట్లలో ప్రధాన శాఖల నిర్లక్ష్య వైఖరి
ఆలయంలోనూ కొనసా..గుతున్న పనులు
20వ తేదీ నాటికి ఆలయంలో పనులు పూర్తి
ఈనెల 23వ తేదీ ఆదివారం నుంచే భక్తుల తాకిడి ఉంటుందని భావిస్తున్నాం. అందుకు తగ్గట్టు ఆలయంలో చేపట్టిన పనులు 20వ తేదీకి పూర్తిచేయాలని నిర్ణయించాం. రంగులు వేసే పని మూడు రోజుల్లో పూర్తవుతుంది. ప్రసాదాలు తయారీని ప్రారంభించాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– డి.చంద్రశేఖరరావు,
ఆలయ ఈఓ
వారమే సమయం.. నత్తేనయం!
Comments
Please login to add a commentAdd a comment