పండితులను తీర్చిదిద్దిన సంస్కృత కళాశాల
తెనాలి: చరిత్రపుటల్లో తెనాలి సంస్కృత కళాశాల చిరస్మరణీయంగా నిలిచిపోతుందని రామాయణ ప్రవచన సుధాకర, సంస్కృత కళాశాల విశ్రాంత ప్రధాన ఆచార్యులు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు అన్నారు. శతాధిక వసంతాలు నడిచిన తెనాలిలోని కోట లక్ష్మయ్యనాయుడు సంస్కృత కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం ప్రథమ వార్షికోత్సవం ఆదివారం సాయంత్రం స్థానిక రాష్ట్రప్రభుత్వ పెన్షనర్స్ హాలులో ఘనంగా నిర్వహించారు. పూర్వవిద్యార్థులు, అధ్యాపకుల జ్ఞాపకాలతో రూపొందించిన ప్రత్యేక సంచిక ‘మనోరమ’ను ఆవిష్కరించారు. కళాశాల పూర్వ విద్యార్థి, ఆగమ పండితుడు మామిళ్లపల్లి మృత్యుంజయప్రసాద్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కళాశాల భవన దాత ముదిగొండ చంద్రమౌళిశాస్త్రి ఆశయాలకు అనుగుణంగా కళాశాల ఏర్పాటై వందేళ్లకు పైగా నడిచినా తర్వాత మూతపడటం బాధాకరమన్నారు. ఎందరో గొప్ప పండితులను తీర్చిదిద్దిన కళాశాల ప్రస్తుతం ఇలా కావడం కలచి వేస్తోందన్నారు. కళాశాల చరిత్ర నిలిచి ఉండేందుకు పూర్వ విద్యార్థుల సంఘం మహాసంకల్పం చేసిందన్నారు. తిరిగి అదే కళాశాలలో సాహిత్యానికి, భాషకు సంబంధించిన కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. దాతల ఆశయానికి అనుగుణంగా విద్యను అభ్యసించి సమాజంలో గుర్తింపు పొందిన ప్రతి వ్యక్తి తిరిగి అదే కళాశాలలో మరెన్నో జ్ఞాన జ్యోతులను వెలిగించడానికి ప్రయత్నించాలని కోరారు. సంఘం కన్వీనర్ పి.వినాయకరావు, దేవయజనం మురళీకృష్ణ, ఈఎల్‌వీ అప్పారావు, చిలుమూరు రామలింగేశ్వరరావు కె.శ్రీనివాస్ శర్మ, మేడూరు శ్రీనివాసమూర్తి, ఎ.సూర్యనారాయణ, జయప్రద, ఎం.సుధారాణి, సద్యోజాతం శేష వీరేశ్వర శర్మ, ఎం.సత్యనారాయణ శాస్త్రి, లక్ష్మీనరసింహారావు, జె.అరుణ గోపాలచార్యులు, ముదిగొండ శ్రీరామ్ మాట్లాడారు. బోధనా సిబ్బంది కొందరు కాలం చేయగా, వారి కుటుంబసభ్యులను సత్కరించారు.
పూర్వజన్మ సుకృతం
కళాశాల పూర్వ విద్యార్థిని, తెలుగు సంస్కృత అకాడెమీ మాజీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ... ఈ కళాశాల తనకు భాషా పరిజ్ఞానాన్ని, సంస్కారాన్ని అందించిందని చెప్పారు. సంస్కృత కళాశాలలో చదవడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఉత్తమ జ్ఞానాన్ని, నడవడికను కూడా పొందగలిగామని పేర్కొన్నారు. మూతబడిన కళాశాలను కనీసం సాహిత్యానికి సంబంధించిన ఉత్తమ గ్రంథాలయంగా రూపొందిస్తే సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. అందుకు తన వంతు సహాయం అందిస్తామన్నారు.
డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment