కళలు దైవ ప్రసాదితాలు
అద్దంకి: కళలు దైవ ప్రసాదితాలని సినీ సాహితీ విమర్శకుడు వారణాసి రఘురామశర్మ అన్నారు. నాటకరంగంలో అపూర్వ ప్రతిభ కనబరచి వేలాది ప్రదర్శనలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు అద్దంకి (తన్నీరు) నాగేశ్వరరావుకు సాహితీ కౌముది ఆధ్వర్యంలో ఆదివారం ‘పుట్టంరాజు బుల్లెయ్య, రామలక్ష్మమ్మల విశిష్ట కళా పురస్కారం – 2025’ అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పుట్టంరాజు కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామశర్మ మాట్లాడుతూ పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల నటుల్లో ఒకరైన నాగేశ్వరరావు సుదీర్ఘ కాలంగా అంకితభావంతో నటించారని తెలిపారు. 3 వేలకు పైగా ప్రదర్శనల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారని చెప్పారు. ఆయన చింతామణి నాటకంలో శ్రీహరి వేషధారణలో చేసే నటన అపూర్వమన్నారు. పూర్వకాలంలో రంగస్థలంపై పురుషులే సీ్త్ర పాత్రలు ధరించేవారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఇతర నాటకాల్లో సీ్త్ర పాత్రలు వారే ధరిస్తున్నా, చింతామణిలో మాత్రం పురుషులే శ్రీహరి పాత్ర ధరిస్తూ మెప్పిస్తున్నారని చెప్పారు. ఆ కోవకు చెందిన నటుడే నాగేశ్వరరావు అని అభినందించారు. సీ్త్ర పాత్రను పురుషుడు మెప్పించడం చాలా కష్టమన్నారు. అదంతా దేవుడు వారికి ప్రసాదించిన వరమన్నారు. పదికాలాల పాటు నాగేశ్వరరావు ఇలాగే కళా సేవ చేస్తూ ఉండాలని ఆకాంక్షించారు. తరువాత పుట్టంరాజు బుల్లెయ్య , రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి దంపతులు పురస్కారాన్ని నాగేశ్వరరావుకు అందించారు. దానిలో భాగంగా దుశ్శాలువాతో సత్కరించి మెమెంటో, ప్రశంసా పత్రాన్ని ప్రదానం చేశారు. ఆర్‌వీ రాఘవరావు, పీసీ హెచ్ కోటయ్య, షేక్ మస్తాన్, లాయర్ రమేష్, ఐ.హనుమంతరావు, ఉప్పు కృష్ణ, గుంటూరు ఆచారి, ఒంగోలు జయబాబు, గండ్రకోట నరసింహారావు, ఆలకుంట శ్రీనివాసరావు, అడుసుమల్లి అనంత కోటేశ్వరరావు పాల్గొన్నారు. వారితోపాటు సాహితీ, నాటకరంగ ప్రముఖులు, సాంస్కృతిక వేత్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పురస్కార గ్రహీతకు అభినందనలు తెలిపారు.
వారణాసి రఘురామ శర్మ
నాగేశ్వరరావుకు కళా
పురస్కారం ప్రదానం
Comments
Please login to add a commentAdd a comment