మంగళగిరి: నగర పరిధిలోని ఆత్మకూరు సాయిబాబా ఆలయం వద్ద శనివారం రాత్రి జరిగిన బంగారం దోపిడీపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. పట్టణంలోని కొప్పురావు కాలనీకి చెందిన దివి నాగరాజు విజయవాడలో డీవీఆర్ గోల్డ్ షాపు నడుపుతున్నారు. శనివారం రాత్రి సుమారు 5 కేజీల బంగారాన్ని తన వద్ద పని చేసే యువకుడితో మంగళగిరి ఇంటికి పంపారు. యువకుడు ఆత్మకూరు జంక్షన్ వద్దకు వచ్చేసరికి కొందరు దుండగులు అడ్డగించి బంగారం దోచుకుని పారిపోయారని నాగరాజు రూరల్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు.
వాస్తవాలు తేల్చే పనిలో పోలీసులు
ఈ ఘటనపై పలు అనుమానాలు రావడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. నాగరాజు అప్పుల బాధ తట్టుకోలేక గతంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మూడు నెలల క్రితం నాగరాజు సతీమణి కుటుంబ కలహాల నేపథ్యలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో నాగరాజు అప్పుల్లో కూరుకుపోయి వాటి నుంచి బయటపడేందుకు బంగారం దోపిడీ నాటకం ఆడారా? అనే కోణంలో విచారిస్తున్నారు. బంగారం తీసుకెళ్లిన యువకుడిని పోలీసులు విచారిస్తుండగా... నాగరాజు సోదరుడు దివి రవి వచ్చి అతడు చాలా నమ్మకస్తుడని చెప్పారు. అతడిని విచారించవద్దని పోలీసులతో పేర్కొనడం గమనార్హం. ఆత్మకూరు జంక్షన్‌లో సంఘటన జరిగినట్లు చెబుతున్న సమయం రాత్రి 7.30 నుంచి 10.30 గంటల వరకు సీసీ టీవీ ఫుటేజీలో దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నారు. బంగారం తరలించిన యువకుడి వాహనం సైతం ఫుటేజీలో లేకపోవడంతో పోలీసుల అనుమానం బలపడుతోంది. ఇప్పటికే పది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విజయవాడలోని దుకాణానికి తీసుకెళ్లి విచారించారు.
Comments
Please login to add a commentAdd a comment