కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
కారంచేడు: వ్యవసాయ పనుల నిమిత్తం తమ యజమాని పొలంలోని ధాన్యం బస్తాలను ఇంటికి తోలేందుకు కూలీలతో పొలానికి బయలుదేరిన వ్యక్తి అకాల మరణం చెందాడు. కారంచేడు ఎస్‌ఐ వి.వెంకట్రావు, ప్రతక్ష్య సాక్షుల వివరాల మేరకు.. మండల కేంద్రం కారంచేడు అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన గర్నెపూడి పోతురాజు (51) సోమవారం తమ యజమాని ఇంటి నుంచి ట్రాక్టర్ తీసుకొని వ్యవసాయ కూలీలతో ధాన్యం బస్తాలు తీసుకురావడానికి పొలానికి బయలుదేరాడు. వాడరేవు–పిడుగురాళ్ల ప్రధాన రహదారిలోని స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో కల్యాణ మండపం ఎదురుగా ఉన్న రొంపేరు కాలువపై నిర్మించిన వంతెన ఎక్కే క్రమంలో అదే వంతెనపై ఎదరుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి ట్రాక్టర్ అదుపు తప్పింది. దీంతో ఒక్కసారిగా కాలువలోని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ట్రాలీలో ఉన్న వ్యసాయ కూలీలు చాకచక్యంగా కిందికి దూకేశారు. ఇంజిన్‌లో ఉన్న పోతురాజుకు కిందకు దూకే అవకాశం లేక నీళ్లలో పడిపోయాడు. నీటిలో ఉన్న పోతురాజును వ్యవసాయ కూలీలు బయటకు తీశారు. అక్కడకు చేరుకున్న మరికొందరితో కలసి సీపీఆర్ చేశారు. 108 వాహనాన్ని పిలిపించి వెంటనే చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పోతురాజు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య లూర్ధు, కుమారులు ఏసు రాజు, గాబ్రియేలు ఉన్నారు.
కంటతడి పెట్టించిన మృతుడి భార్య రోదన
కూలి పనులు చేసుకుంటే గాని పూట గడవని పేద కుటుంబం పోతురాజుది. అనారోగ్యంతో ఉన్న భార్యను చిన్నచిన్న పనులకు మాత్రమే పంపించేవాడు. తానే అన్నీ అయి బిడ్డలను చదివించుకుంటూ, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పోతురాజు మృతితో కుటుంబ సభ్యులు దిక్కులేనివారయ్యారు. మాకు దిక్కెవరయ్యా అంటూ మృతుడి భార్య లూర్ధు రోదిస్తున్న తీరు చూపరులచే కంటతడి పెట్టించింది.
డ్రైవర్ మృతి, ఐదుగురు కూలీలకు గాయాలు కారంచేడులో రొంపేరు కాలువ వద్ద ఘటన
కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
Comments
Please login to add a commentAdd a comment