జీబీ సిండ్రోమ్‌పై అవగాహన కల్పించండి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: గులియన్ బ్యారి(జీబీ) సిండ్రోమ్ వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పిస్తూ వ్యాప్తిని అరికట్టాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా చేపట్టిన అభా కార్డుల నమోదు ప్రక్రియ, జీబీ సిండ్రోమ్ వ్యాధి వ్యాప్తిపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీడియో సమావేశం నిర్వహించారు. ప్రాణాంతకమైన జీబీ సిండ్రోమ్ వ్యాధికి జిల్లా వాసులు గురిగాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలోని విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. బ్యాక్టీరియా సోకి వ్యాధిగ్రస్తులైన వారికి ప్రభుత్వం ప్రత్యేక వైద్యం అందిస్తుందని కలెక్టర్ చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌లో, ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్‌లో ప్రత్యేక కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అభా కార్డుల నమోదు ప్రక్రియ పది రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. జిల్లాలో కిడ్నీ డయాలసిస్ కేసులు 1010 ఉన్నాయని, నూతనంగా డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు తక్షణమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. డీఆర్‌ఓ జి.గంగాధర్ గౌడ్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.
చేనేతల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచాలి..
బాపట్ల: చేనేత కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. చేనేత కుటుంబాల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు తీసుకోవలసిన చర్యలపై సంబంధిత అధికారులతో సోమవారం స్థానిక కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ముద్ర పథకం కింద చేనేత కుటుంబాలకు చేయూత అందించేందుకు 1,044 మందికి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ఇప్పటివరకు 76 మందికి మాత్రమే ఆయా బ్యాంకుల ద్వారా రుణాలు అందాయని తెలిపారు. జిల్లాలో చీరాల, వేటపాలెం, భట్టిప్రోలు, చెరుకూరు, రేపల్లె, మార్టూరు మండలాల్లో నేత కార్మికుల కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని, వీరిని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు, ఎల్‌డీఎం కలసి వ్యక్తిగతంగా వెళ్లి వారితో చర్చించి రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు నాగమల్లేశ్వరరావు, ఎల్‌డీఎం శివకృష్ణ, డీఆర్‌డీఏ పీడీ పద్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment