పోలీసుల తీరుతో ఆత్మహత్యాయత్నం
జె.పంగులూరు: పోలీసుల వేధింపులు భరించలేక వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడైన కొడుకు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా ఆ డబ్బా లాక్కొని తల్లి తాగిన ఘటన బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం అలవలపాడులో సోమవారం రాత్రి జరిగింది. బాధితుల కథనం మేరకు.. రెండేళ్ల క్రితం అలవలపాడు గ్రామానికి చెందిన షేక్ ఇమామ్, అతని భార్య సల్మా కుటుంబ కలహాలతో విడిపోయారు. వారికి 18 నెలల పాప ఉంది. షేక్ ఇమామ్ తన భార్య తనవద్దకు రావాలని పెద్ద మనుషులను పిలిపించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చట్టపరంగా విడాకులు కావాలని కోరాడు. దీంతో సల్మా తనను గృహహింస చేస్తున్నారంటూ భర్త, అత్త మరికొందరిపై రేణింగవరం స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇమామ్ కుటుంబం మొదటి నుంచి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులుగా ఉండేవారు. ఈ కేసును ఆసరాగా చేసుకుని కొందరు టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తేవడంతో ఇమామ్ కుటుంబంతో సంబంధం లేని మరో తొమ్మిది మందిపై రేణింగవరం ఎస్‌ఐ వినోద్‌బాబు 498 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రతి రోజూ తొమ్మిది మందిని ఎస్‌ఐ స్టేషన్‌కి పిలిపించి వేధిస్తున్నారు. అంతటితో ఆగకుండా సోమవారం ఎస్‌ఐ తనతో దురుసుగా ప్రవర్తించారని, ‘నీ భార్య బంగారం ఆమెకు ఇచ్చేయి. లేకుంటే నీపై దొంగతనం కేసు నమోదు చేస్తా.. నీ కుటుంబాన్ని రోడ్డు కీడుస్తా..బంగారాన్ని సీజ్ చేస్తా.. జీవితంలో బయటకు రాకుండా చేస్తా..’ అంటూ దురుసుగా మాట్లాడాడని బాధితుడు ఇమామ్ వాపోయాడు. ఎస్‌ఐ మాటలు భరించలేక పురుగుల మందు తాగి చనిపోదామని తెచ్చుకుంటే.. ఆ మందు డబ్బాను లాక్కొని ఇమామ్ తల్లి గాలీబ్‌బీ తాగింది. ఆమెను హుటాహుటిన అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయంలో ప్రమేయం లేని తన చెల్లెలిని పసిపిల్ల తల్లి అని కూడా చూడకుండా రాత్రిళ్లు స్టేషన్‌కు పిలిపించి టార్చర్ పెడుతున్నారని బాధితుడు కన్నీటిపర్యంతం అయ్యాడు. ఈ విషయమై ఎస్‌ఐను వివరణ కోరగా దంపతుల మధ్య సఖ్యత కుదిర్చేందుకు ఇద్దరినీ పిలవగా, సల్మా స్టేషన్‌కు వచ్చేందుకు ఇష్టపడటం లేదని, కోర్టులో ఈ వ్యవహారం తేల్చుకోమని చెప్పడం మాత్రమే జరిగిందని తెలిపారు.
కొడుకు చేతిలోని పురుగుల మందు డబ్బా లాక్కొని తాగిన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు
పోలీసుల తీరుతో ఆత్మహత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment