‘ప్రకృతి’తో ఆరోగ్యకర పంటలు
ప్రకృతి వ్యవసాయం జిల్లా అడిషనల్ డీపీఎం మోహన్
యద్దనపూడి: ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వనరులను వినియోగించుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని ప్రకృతి వ్యవసాయశాఖ అడిషనల్ డీపీఎం మోహన్ అన్నారు. సోమవారం మండలంలోని పూనూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్‌పీఎం (పురుగు మందులు లేని వ్యవసాయం) దుకాణం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విచక్షణ రహితంగా ఎరువులు, పురుగుమందులు వాడటం వల్ల ప్రస్తుతం భూసారం క్షీణించి గాలి, నీరు కలుషితమవటంతో పాటు ప్రజలు అనారోగ్యంతో బాధపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీని నివారణకు ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంభించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఇంటిలో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకొని ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించుకొని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలన్నారు. ఎన్‌ఎఫ్‌ఏ శ్రీనివాసరావు, ఎన్‌పీఎం మాస్టర్ ట్రైనర్ భీమరాజులు మాట్లాడారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తయారు చేసిన కషాయాలను పరిశీలించారు. మాస్టర్ ట్రైనర్ వెంకటేశ్వర్లు, వ్యవసాయాధికారి మేరమ్మ, హోమియో వైద్యాధికారి గుర్రం అంజమ్మ, మండల సమైఖ్య అధ్యక్షురాలు బత్తుల కృష్ణవేణి, ఎల్‌టూలు వెంకటరత్నం, కోటిబాబు, మోడల్ మేకర్ నాగరాజు, ఐసీఆర్పీలు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment