ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్టు
రూ.2.40 లక్షల విలువైన 24 కిలోల గంజాయి పట్టివేత
నగరంపాలెం: ఇద్దరు గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాలులో సోమవారం ట్రైనీ ఐపీఎస్ దీక్ష, జిల్లా ఏఎస్పీ కె. సుప్రజ (క్రైం)తో కలిసి కేసు వివరాలను ఆయన తెలిపారు. గుంటూరు రూరల్ మండలం శివారెడ్డిపాలెం పోలేరమ్మ గుడి సమీపాన ఉంటున్న దమ్మాలపాటి మణికంఠ ఏడో తరగతి వరకు చదివాడు. చెడు అలవాట్లకు బానిసయ్యాడు. బేల్దారి పనులతో పాటు ట్రాక్టర్ డ్రైవర్‌గా వెళ్లేవాడు. గతేడాదిలో వైజాగ్ వెళ్లి, తిరుగు ప్రయాణంలో తునిలో దిగి, గంజాయి ఎక్కడ విక్రయిస్తారని వాకబు చేశాడు. అనంతరం విశాఖపట్నం జి.మడుగు మండలం పెద్ద కిల్తారికి చెందిన చింతల సత్యనారాయణ అలియాస్ సతీష్‌తో పరిచయమైంది. దీంతో రూ.10 వేలకు రెండు కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. అక్కడ నుంచి ప్రతిసారి బస్‌లో వెళ్లి, రైళ్ల ద్వారా గుంటూరుకు గంజాయి తెచ్చేవాడు. యాభై గ్రాములు సంచులను రూ.500కు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట చింతల సత్యనారాయణకు ఫోన్ చేసి భారీగా గంజాయి కావాలని అడిగాడు. దీంతో సత్యనారాయణ భార్య చింతల పద్మ 24 కిలోల గంజాయిని సోమవారం మణికంఠ నివాసానికి తీసుకువచ్చింది. ముందస్తు సమాచారంతో మణికంఠను, చింతల పద్మను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2.40 లక్షల ఖరీదు చేసే 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సతీష్‌ను త్వరలో పట్టుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment