సర్వేను అడ్డుకున్న పచ్చమూకలు
కొల్లూరు: టీడీపీ వర్గీయులు అడ్డగింత కారణంగా వివాదాస్పదంగా మారిన నడకదారి హద్దుల వ్యవహారం సర్వే జరగకుండానే నిలిచిపోయింది. మండలంలోని జువ్వలపాలెం శివారు గుంటూరుగూడెంలో టీడీపీకి చెందిన పక్క పొలం రైతు తన పంట పొలంలోని మొక్కజొన్న పంటను ధ్వంసం చేసి బలవంతంగా తన భూమిని ఆక్రమించుకున్నాడని మారీదు ప్రసాద్ అనే రైతు ఆరోపించాడు. గుంటూరుగూడెంకు చెందిన రైతు ప్రసాద్ ఈ వ్యవహారంపై రెవెన్యూ యంత్రాంగంను సైతం సంప్రదించి సర్వే చేయించి న్యాయం చేయాలని అప్పట్లోనే వినతి పత్రం రూపంలో మొరపెట్టుకున్నాడు.
ఈనెల 4న ‘సాక్షి’లో ‘పేద రైతుపై దౌర్జన్యకాండ’ శీర్షికతో కథనం సైతం వెలువడింది. సమస్యను పరిష్కరించేందుకు బాధిత రైతును ప్రభుత్వ సర్వేకు దరఖాస్తు చేసుకోవాలని కొల్లూరు తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు సూచించడంతో వారు అధికారిక సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రవేటు సర్వేయర్లతో టీడీపీకి చెందిన నాయకుడు వేములపల్లి రవికిరణ్ కొలతలు కొలిపించి తనపై దౌర్జన్యానికి పాల్పడి తమపై దాడి చేయించి పొలం ఆక్రమించుకోవడంతోపాటు, నష్టం కలిగించారన్న బాధితుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ ప్రభుత్వ సర్వేయర్లు కొలతలు సేకరించాలని ఆదేశించడంతో సోమవారం కొలతల ప్రక్రియ కోసం సర్వేయర్లు వివాదాస్పద భూమి వద్దకు వెళ్లారు. ఈనేపథ్యంలో బాధిత రైతులు తమ వద్దనున్న పత్రాలను అందజేసి దాని ప్రకారం తమ హద్దులు నిర్ణయించాలని సర్వేయర్లను కోరారు. టీడీపీ నాయకుడు వర్గీయులు మాత్రం మొత్తం భూమికి కొలతలు సేకరించడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని, బాధిత రైతు పేర్కొంటున్న 2 సెంట్ల భూమి తమకు చెందినదని కొలతల సేకరణను అడ్డగించారు. ఒక దశలో బాధిత రైతుల పక్షాన నిలిచి సామరస్యంగా సమస్యను పరిష్కరించేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులపైన సైతం దురుసుగా వ్యవహరిస్తూ వివాదం సృష్టించారు. దీంతో భూమి హద్దులు నిర్ధారించేందుకు వెళ్లిన సర్వేయర్లు టీడీపీ నాయకులు వివాదంలో ఉన్న 2 సెంట్ల భూమి కొలిసేందుకు ఒప్పుకునేది లేదని పట్టుపట్టడంతో సాయంత్రం వరకు వేచి చూసి వెనుతిరిగారు. బాధిత రైతు పక్షాన వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు సుగ్గున మల్లేశ్వరరావు వివాదాస్పదమైన భూమి వద్దకు వెళ్లి కొలత ప్రక్రియ చట్టబద్ధంగా నిర్వహించాలని సర్వేయర్లను కోరారు.
నడకదారి వివాదంలో ప్రభుత్వ సర్వే అడ్డగింత కొలతలు సేకరించవద్దంటూ పట్టు రికార్డుల ప్రకారం కొలతలు సేకరించాలని పేద రైతు మొర ఇరు వర్గాల నడుమ వివాదంతో సర్వే నిలిపివేసిన యంత్రాంగం
లింక్ డాక్యుమెంట్లతో సమస్య పరిష్కరిస్తాం
నడక దారి వివాదంలో తన వద్ద ఉన్న పత్రాల మేరకు 1.06 సెంట్లకు కొలతలు నిర్వహించి హద్దులు నిర్వహించాలని బాధిత రైతు సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే పక్క రైతు సైతం తమ పత్రాల మేరకు ఆభూమి తమ కు చెందుతుందని వెల్లడించడంతో కొలతల సేకరణను నిలుపుదల చేయాల్చి వచ్చింది. ఆ భూములకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు, ఇతర పత్రాలను సైతం తీసుకురావాలని ఇరుపక్షాలకు సూచించి తిరిగి కొలతలు నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
–బి. వెంకటేశ్వర్లు, తహసీల్దార్, కొల్లూరు.
Comments
Please login to add a commentAdd a comment