కొలిక్కి రాని బంగారం చోరీ కేసు
మంగళగిరి: బంగారం చోరీ కేసు పోలీసు అధికారులకు అంతుచిక్కడం లేదు. రూ.5 కోట్ల అని చెబుతుండడంతో అధికారులు లోతైన విచారణ చేపట్టారు. సోమవారం ఎస్పీ సతీష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులకు దర్యాప్తుపై పలు సూచనలు చేశారు. ఏఎస్పీ రవి కుమార్ నేతృత్వంలో ఫిర్యాదుదారుడు దివి నాగరాజుతో పాటు దుకాణంలో పని చేస్తున్న ఐదుగురు యువకులను రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారిస్తున్నారు. పట్టణానికి చెందిన దివి రాము, విజయవాడలో డీవీఆర్ జ్యూయలరీ దుకాణం నిర్వహిస్తుంటాడు. అందులో మేనేజర్‌గా పనిచేసే దివి నాగరాజు ఈ నెల 15వ తేదీ రాత్రి సుమారు ఐదు కిలోల వివిధ రకాల బంగారు ఆభరణాలను సంచిలో పెట్టుకుని స్కూటీపై వస్తుండగా ఆత్మకూరు బైపాస్‌లోని అండర్ పాస్ వద్ద గుర్తు తెలియని ఇద్దరు యువకులు అడ్డుకుని సంచిని లాక్కుని పారిపోయారని మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో చోరీ జరిగిన తీరుపై ట్రయల్ రన్ నిర్వహించారు. సంచి లాక్కుని వెళ్లిన తీరుపై నిర్వహించిన ట్రయల్ రన్‌లో లాగినా సంచి చేతికి వచ్చే అవకాశం లేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. విజయవాడలో ఆభరణాలతో బయల్దేరిన నాగరాజు ఏ మార్గంలో మంగళగిరి చేరుకున్నారనే అంశంపై సీసీ కెమెరాలను పరిశీలించారు. విజయవాడ దుకాణం వద్ద నుంచి కెమెరాలను పరిశీలించిన పోలీసులు 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్న ఇద్దరు వ్యక్తులు నాగరాజును వెంబడించినట్లు గుర్తించి వారిని అనుమానిస్తున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. దీంతో అసలు చోరీ జరిగిందా లేదా అనే అంశంతో పాటు చోరీ జరిగిన రోజున దుకాణంలో ఐదు కేజీల బంగార ఆభరణాలున్నాయా.. ఆభరణాలు తయారు చేయించుకున్న దుకాణదారులు, కస్టమర్లు ఎవరు అనే కోణంలోను దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన
ఎస్పీ సతీష్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment