మెడికల్ కళాశాల భవిష్యత్తు ప్రశ్నార్థకం
మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
బాపట్ల: గత ప్రభుత్వ హయాంలో రూ. 505 కోట్ల నిధులతో మంజూరైన బాపట్ల మెడికల్ కళాశాల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం ప్రశ్నార్ధకంగా మార్చడం దారుణమని, అసలు ఏం చేయబోతున్నారో కూడా ఎవరికీ తెలియడం లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. మంగళవారం తనను కలిసిన విలేకరులతో కోన మాట్లాడారు. అసాధ్యమని భావించిన అనేక పనులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పూర్తిచేసి బాపట్ల వాసులకు అందించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కొన్ని కొత్త జిల్లాల కేంద్రాలు (హెడ్ క్వార్టర్స్) ఒక ప్రాంతంలో ఉండగా, మెడికల్ కళాశాలలు మరో ప్రాంతానికి మంజూరయ్యాయని, బాపట్లకి మాత్రం జిల్లా కేంద్రం, మెడికల్ కళాశాల రెండింటినీ తీసుకువచ్చామని, ఈ అభివృద్ధిని కొనసాగించాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకుల మీద ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో కొన్ని మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయనుండటం పట్ల అభ్యంతరం తెలిపారు. బాపట్ల మెడికల్ కళాశాలపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కళాశాల నిర్మాణంలో ఎంతో క్లిష్టమైన భూసేకరణ, పునాదులకు సంబంధించిన పనులను తమ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ మెడికల్ కళాశాల విషయంలో ఎటువంటి పొరపాట్లు చేయరాదని సూచించారు. బాపట్లలో నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కళాశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
చింతపల్లి మేజర్‌కుసాగునీరు విడుదల
అచ్చంపేట: మండలంలోని కొండూరు పంచాయతీ పరిధిలోని శ్రీనివాసతండా వద్ద నాగార్జున సాగర్ కాలువల ద్వారా చింతపల్లి మేజర్‌కు సాగునీటి అవసరాలకు కెనాన్స్ ఏఈ చిల్కా భాస్కర్ ఆదేశాలతో మంగళవారం సాగునీటిని వదిలారు. చింతపల్లి మేజర్ కాలువ కింద ప్రస్తుతం మిర్చి, మొక్కజొన్న, పొగాకు తదితర పంటలు వేశారు. ఈ కాలువకు నీళ్లు రాకపోవడంతో రైతులు గత కొద్దికాలంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నుంచే కస్తల మేజర్‌కు సాగునీటిని వదిలిన అధికారులు చింతపల్లి మేజర్‌కు వదలకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు శ్రీనివాసతండా నుంచి ఐదు రోజులు కస్తల మేజర్‌కు, ఐదు రోజులు కస్తల మేజర్‌కు సాగునీటిని మార్చి మార్చి వదిలే విధంగా ఆదేశాలు జారీ చేశారు.
అమరేశ్వరుని సేవలో క్యాట్ న్యాయమూర్తి
అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరుని మంగళవారం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్) న్యాయమూర్తి లతా భరద్వాజ్ దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు న్యాయమూర్తికి స్వాగతం పలికారు. అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి శేషవస్త్రంతో పాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట క్యాట్ మెంబర్ వరణ్‌సింధు కౌముది, అధికారులు ఉన్నారు.
కాలువలో కారు బోల్తా
అమర్తలూరు(వేమూరు): ఇంటూరు కాల్వలో కారు బోల్తా పడిన ఘటన మంగళవారం జరిగింది. అమర్తలూరు పోలీసుల కథనం మేరకు గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగే శుభ కార్యక్రమానికి వెళ్లేందుకు కారులో బయలుదేరారు. ఈక్రమంలో ఉదయం 6.30 నిమిషాలకు ఇంటూరు నుంచి చెరుకుపల్లి వెళ్లే దారిలో లారీని క్రాస్ చేస్తుండగా అదుపు తప్పి కారు ఇంటూరు కాల్వలో పడింది. అందులోఉన్న వారికి స్వల్ప గాయాలు కావడంతో చెరుకుపల్లిలో ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొంది, రేపల్లె వెళ్లినట్లు ఎస్‌ఐ జానకి అమర్ వర్థన్ తెలిపారు.
మెడికల్ కళాశాల భవిష్యత్తు ప్రశ్నార్థకం
మెడికల్ కళాశాల భవిష్యత్తు ప్రశ్నార్థకం
మెడికల్ కళాశాల భవిష్యత్తు ప్రశ్నార్థకం
Comments
Please login to add a commentAdd a comment