హత్యకేసులో ఎనిమిది మందికి జీవిత ఖైదు | - | Sakshi
Sakshi News home page

హత్యకేసులో ఎనిమిది మందికి జీవిత ఖైదు

Published Wed, Feb 19 2025 1:34 AM | Last Updated on Wed, Feb 19 2025 1:31 AM

హత్యకేసులో ఎనిమిది మందికి జీవిత ఖైదు

హత్యకేసులో ఎనిమిది మందికి జీవిత ఖైదు

మార్టూరు: బాపట్ల జిల్లా మార్టూరు మండల పరిధిలో సుమారు పది సంవత్సరాల క్రితం జరిగిన ఓ హత్య కేసులో ఎనిమిది మంది నిందితులకు ఒంగోలు ఏడో అడిషనల్‌ డిస్టిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి శ్రీ రాజా వెంకటాద్రి జీవిత ఖైదు విధించారు. అలాగే ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా విధించారు. బాపట్ల ఎస్పీ తుషార్‌ డూడీ మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రెస్‌ నోట్‌ వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుత బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం రామకూరు గ్రామానికి చెందిన దళిత మహిళ బూరగ యేసు దయమ్మ కుమారుడు బూరగరత్నం బాబు (22) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేసేవాడు. 2015లో రత్నం బాబు అదే గ్రామానికి చెందిన బాలిక షేక్‌ కరిష్మా (17) ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసిన అమ్మాయి తరపు పెద్దలు పలుమార్లు ఇద్దరినీ హెచ్చరించినా వారు ఖాతరు చేయలేదు. చెప్పిన మాట వినడం లేదని కరిష్మాను ఆమె తల్లిదండ్రులు మార్చి 23వ తేదీ 2015లో ఇంటి నుంచి బయటకు పంపించేశారు. ఈ క్రమంలో రత్నంబాబు కరిష్మాకు మైనారిటీ తీరాక పెళ్లి చేసుకుంటానని అప్పటివరకు ఆమెను తమ ఇంట్లోనే ఉంచుకుందామని తల్లిని ఒప్పించి ఇంటికి తీసుకువెళ్లాడు. నెల రోజుల తర్వాత ఏప్రిల్‌ 28, 2015న కరిష్మా మేనమామలైన నజీర్‌, మున్నీర్‌ బాషా వారి స్నేహితుడు అన్వర్‌ బాషా కలిసి.. రత్నం బాబు ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు జె.పంగులూరు గ్రామ మసీదులో ఇద్దరి వివాహానికి అంతా నిశ్చయించామని వలపర్ల వెళ్లి పెళ్లికి అవసరమైన బట్టలు కొనుగోలు చేద్దామని నమ్మించి రత్నం బాబును తమతో తీసుకుని వెళ్లారు. అదే రోజు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో రత్నం బాబును రామకూరు ఉత్తరం వైపు పొలాల్లోకి తీసుకువెళ్లి మరికొందరితో కలిసి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. మరుసటి రోజు ఉదయం రక్తపు మడుగులో ఉన్న రత్నం బాబు మృతదేహాన్ని స్థానికుల సమాచారంతో తెలుసుకున్న రత్నం బాబు తల్లి బూరగ యేసు దయమ్మ.. మార్టూరు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి చీరాల డీఎస్పీ సి.జయ రామరాజు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపి ఆధారాలు, సాక్షుల నుంచి వాంగ్మూలాలు సేకరించారు. హత్య జరిగినట్లు నిర్ధారించి మొత్తం తొమ్మిదిమందిని నిందితులుగా గుర్తించి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కోర్టులో సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులపై హత్యానేరం రుజువు కావడంతో ఒంగోలు ఏడో అడిషనల్‌ అండ్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ జడ్జి టి.రాజా వెంకటాద్రి మంగళవారం సాయంత్రం తీర్పు వెలువరించారు. మొత్తం తొమ్మిది మంది నిందితుల్లో రామకూరు గ్రామానికి చెందిన ఏ8 ముద్దాయి షేక్‌ మస్తాన్‌ విచారణ సమయంలో మృతి చెందాడు. మిగిలిన వారిలో ముగ్గురు మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందిన ఏ1 షేక్‌ మునీర్‌ బాషా, ఏ2 షేక్‌ అన్వర్‌ బాషా, ఏ3 షేక్‌ నజీర్‌ కాగా రామకూరు గ్రామానికి చెందిన ఏ4 షేక్‌ కరిముల్లా, ఏ5 షేక్‌ బాజీ బుడే, ఏ6 షేక్‌ సద్దాం హుస్సేన్‌, ఏ7 షేక్‌ షకీల.. యద్దనపూడి మండలం పూనూరు గ్రామానికి చెందిన ఏ9 పఠాన్‌ మౌలాలికి జడ్జి రాజా వెంకటాద్రి జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వై.ప్రశాంతకుమారి సాక్ష్యాధారాలతో నిరూపించారు. సాక్షులకు సరైన రీతిలో నిర్భయంగా సాక్ష్యం చెప్పే విధంగా తర్ఫీదునిచ్చి నేరం రుజువై నిందితులకు శిక్ష పడేందుకు సహకరించిన వారిని ఎస్పీ తుషార్‌ డూడీ ప్రత్యేకంగా అభినందించారు. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు పర్యవేక్షణలో మార్టూరు సీఐ ఎం.శేషగిరిరావు, కోర్టు కానిస్టేబుళ్లు ఎ.శ్రీనివాసులు, ఎ.కిరణ్‌ లు కేసును ఛేదించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement