మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
నాగులుప్పలపాడు: ఈ ఏడాది మిర్చి రైతులు తీవ్రంగా నష్టాల్లో కూరుకుపోయారని, ఆ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. మండలంలోని ఒమ్మెవరం గ్రామంలో మిర్చి కళ్లాల్లో పంటను మంగళవారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ మిర్చి పంటకు సరైన ధర లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులు ఏనాడూ గిట్టుబాటు ధర కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వమే అండగా నిలిచిందన్నారు. గత ఏడాది మిర్చి ధరలు క్వింటాలుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పలికాయని, ప్రస్తుతం ఈ ధరలు క్వింటాకు రూ.12 వేలకు పడిపోవడం బాధాకరమన్నారు. రైతులకు ఎకరాకు రూ.2.50 లక్షల వరకు పెట్టుబడి అవుతుందని, ఈ పరిస్థితుల్లో నల్లి, తామర తెగులుతో దిగుబడులు భారీగా తగ్గాయన్నారు. ఎకరాకు దిగుబడి 10 నుంచి 15 క్వింటాళ్లకు మించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఒక్కో ఎకరానికి రైతు సుమారు రూ.1.50 లక్షల వరకు నష్టపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు నలమలపు కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, కంచర్ల సుధాకర్, కోటిరెడ్డి, కుమ్మూరి సుధాకర్, గండు వెంకట్రావు, హరిబాబు, రాంబాబు, అంజిరెడ్డి, బాలకృష్ణ, సుబ్బారావు, వెంకటేష్ ఉన్నారు.
ధరల పతనంతో నష్టాల్లో మిర్చి రైతులు వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున
Comments
Please login to add a commentAdd a comment