శిడి బండి సంబరం
వైభవం..
ఉయ్యూరు: అశేష భక్తజన కోలాహలం.. సన్నాయి మేళాల జోరు, డప్పు వాయిద్యాల హోరు.. జై వీరమ్మ.. జైజై వీరమ్మ భక్తజన నినాదాల నడుమ.. శిడిబండి ఊరేగింపు కనుల పండువగా సాగింది. పెళ్లి కుమారుడు ఉయ్యూరు మౌర్యకిరణ్ శిడిబుట్టలో కూర్చున్న ఉత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. పారుపూడి, నెరుసు వంశస్తులు మూడు సార్లు శిడి ఆడించటంతో ఉత్సవం ముగిసింది.
నయనానందకరంగా..
ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో 11వ రోజు నిర్వహించే ప్రధాన ఘట్టమైన శిడిబండి వేడుక మంగళవారం నయనానందకరంగా సాగింది. పాత వాటర్ ట్యాంకు రోడ్డులో ప్రత్యేకంగా తయారుచేసిన శిడిబండికి స్థానికులు పసుపునీళ్లు ఓరబోసి గుమ్మడికాయలు కట్టి, కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఊరేగింపుగా బయలుదేరిన శిడిబండికి దారిపొడవునా భక్తులు పువ్వులు విసురుతూ పసుపునీళ్లు ఓరబోస్తూ హారతులు పట్టారు. పూలదండలు, గుమ్మడికాయలను శిడిబండికి కట్టి భక్తిపారవశ్యం చెందారు. కాలేజ్ రోడ్డు, ప్రధాన రహదారి వెంబడి సాగిన ఊరేగింపులో అశేష భక్తజనం పాల్గొని తన్మయత్వం చెందారు.
శిడిబుట్టలో కూర్చున్న పెళ్లి కుమారుడు..
సంప్రదాయం ప్రకారం ఉయ్యూరు దళితవాడ నుంచి పెళ్లి కుమారుడు ఉయ్యూరు మౌర్య కిరణ్ ఊరేగింపుగా ఆలయం వద్దకు తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు మౌర్య కిరణ్‌ను శిడి బుట్టలో కూర్చోబెట్టి ఆలయ ప్రదక్షిణ చేయించారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా శిడిబండిని నిలిపి మూడుసార్లు శిడి ఆడించటంతో ఉత్సవం ముగిసింది. శిడి ఆడే సమయంలో భక్తులు అరటికాయలు విసురుతూ భక్తిపారవశ్యం చెందారు. వేడుక అనంతరం పెళ్లి కుమారుడితో పాటు ఉయ్యూరు వంశస్తులు, బంధువులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో 300 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
ఉత్సవానికి పోటెత్తిన భక్తజనం
శిడి బండి సంబరం
Comments
Please login to add a commentAdd a comment