బెదిరింపులు మంచి పద్ధతి కాదు
ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి మేకల ప్రసాద్
బాపట్లటౌన్: పేదల విముక్తి పోరాటానికి నాయకత్వం వహించే నాయకుల్ని హత్య చేస్తామని బెదిరించడం విప్లవోద్యమానికి ద్రోహం చేయడమేనని అఖిలభారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర కార్యదర్శి మేకల ప్రసాద్ అన్నారు. బాపట్లలోని డ్రైవర్స్ కాలనీలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రసాద్ మాట్లాడుతూ చంద్రన్న పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఈ పద్ధతి మానుకొని ప్రజా ఉద్యమ నిర్మాణానికి పోటీ పడాలన్నారు. బాపట్లలోని మాజీ ఎంపీ మాదాల నారాయణస్వామి కాలనీలో ప్రజలు చంద్రన్న నాయకత్వాన్ని ధిక్కరిస్తే నాదెండ్ల బ్రహ్మయ్యకు పట్టిన గతే ప్రసాద్‌కు పడుతుందని కాలనీలో సమావేశాలు పెట్టి హెచ్చరించడం విప్లవ నిబంధనలను ఉల్లంఘించడమే అన్నారు. చంద్రన్న విప్లవ విధానాలను విడిచిపెట్టి ఆర్థిక నేరాలు, భూ పంచాయతీలు, భూమి కొనుగోలు, హత్యలు చేయడం సిగ్గుచేటన్నారు. చంద్రన్న నాయకత్వంలోని న్యూ డెమోక్రసీ పార్టీని రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు వీడి మాతృ సంస్థ అయిన సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీతో చర్చలు జరిపి ఐక్యమయ్యారన్నారు. ఈ అక్కసుతోనే బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. దానిలో భాగంగా మా ఇంటికి వచ్చి బెదిరింపు చర్యలకు పాల్పడ్డారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విప్లవ శ్రేణులు ఖండించాలన్నారు. సమావేశంలో పీవోడబ్ల్యూ బాపట్ల మండల అధ్యక్షులు కొండా అన్నమ్మ, డివిజన్ కార్యదర్శి మువ్వల పల్లవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment