న్యాయం జరిగేవరకు పోరాడుతాం
● సమస్య సీఎం దృష్టికి వెళ్లినా పరిష్కారం కాకపోవటంపై అసంతృప్తి ● భవిష్యత్ కార్యాచరణపై పుల్లారావు బాధితుల సమావేశం
నరసరావుపేట టౌన్: కలిసి కట్టుగా ఉద్యమం చేసి న్యాయం జరిగే వరకు పోరాడదామని సాయి సాధన చిట్‌ఫండ్ స్కాం బాధితులు తీర్మానించుకున్నారు. సాయి సాధన చిట్‌ఫండ్ బాధితులు సోమవారం పట్టణంలోని ఓ హోటల్‌లో సమావేశం అయ్యారు. పాలడుగు పుల్లారావు చిట్‌ఫండ్, విజయలక్ష్మి టౌన్‌షిప్ పేర్లతో కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారీ అయిన విషయం విధితమే. రియల్ ఎస్టేట్ మోసంపై పుల్లారావుతో పాటు అతని భాగస్వాములపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదు అవ్వగా, కోర్టులో లొంగిపోయి సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆ కేసులో సోమవారం పుల్లారావు అతని భాగస్వాములు గుండా సాంబశివరావు, గుండా అనిల్‌లకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు నమోదు చేసిన చీటింగ్ కేసులో పుల్లారావుకు బెయిల్ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై బాధితులంతా సమావేశమై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్య తీసుకువెళ్లినా న్యాయం జరగలేదని కొందరు అభిప్రాయబడ్డారు. కేసు సీఐడీకి బదిలీ అయినప్పటి నుంచి పుల్లారావు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేసే వరకు అవసరమైతే రిలే నిరాహార దీక్షలు చేద్దామని చర్చించుకున్నారు. చీటీపాట స్కాంలో ఉన్న బాధితులు సుమారు 600 మందితో త్వరలోనే సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యులు చేకూరి సాంబశివరావు, ఇ.ఎం.స్వామి, యామిని రామారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment