కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
● ఒక్క సంక్షేమ కార్యక్రమాన్నీ పరిపూర్ణంగా అమలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ● సమయం వచ్చినప్పుడు ఓట్లతో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ప్రజలు ● యువత పోరు సన్నాహాక సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి ● రేపటి వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం, యువత పోరు జయప్రదానికి విజ్ఞప్తి
నెహ్రూనగర్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 9 నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన జరగనున్న యువత పోరుకు సంబంధించి సోమవారం సన్నాహక సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూటమి పాలనలో రాష్ట్రం తిరోగమనంలో ఉందన్నారు. గుంతలు పూడ్చి రోడ్లు వేశామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 9 నెలల కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పరిపూర్ణంగా అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఇస్తున్న వృద్ధాప్య పింఛన్‌లలో భారీగా కోతలు పెడుతున్నారని విమర్శించారు. 9 నెలల కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని, సమయం వచ్చినప్పుడు ఓట్లతో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోడ్లపైకి వచ్చి అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు.
కూటమి ఎమ్మెల్యేల అక్రమాలు అనంతం
కూటమి పాలనలో ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, బియ్యం అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారని తెలిపారు. రోజు రోజుకు కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు కూడా ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 12న జరిగే వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాల్లో, యువత పోరు కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాలుపంచుకుని దిగ్విజయం చేయాలన్నారు. తద్వారా ఈ ప్రభుత్వం సక్రమంగా పనిచేయడం లేదనే సందేశాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. పార్టీ శ్రేణులే పేదవారి గొంతుగా మాట్లాడాలని సూచించారు. పార్టీ గుంటూరు, నరసరావుపేట పార్లమెంటరీ స్థానాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆనాడు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక ఎత్తు అయితే.. తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ సారథిగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించారన్నారు. మోసం చేయడంలో నంబర్ వన్ అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబు పేరే అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తామని బూటకపు మాటలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. సమాజంలో విద్య, ఆరోగ్యం రెండు కళ్లు వంటివన్నారు. నేడు విద్యకు సంబంధించి ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధులు రాకపోవడంతో విద్యార్థులు కాలేజీల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వైఎస్సార్‌సీపీ యువత పోరు కార్యక్రమం చేపట్టిందన్నారు. ఏపీలో 28 మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే.. ఇంటికే వచ్చి వైద్యం చేసే పరిస్థితి ఉందన్నారు. ఆ మెడికల్ కాలేజీలను నేడు ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. వీటన్నింటిపై పోరాటం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, గుంటూరు నగర అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణలు మాట్లాడారు. పార్టీ బలోపేతానికి సూచనలు చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment