గేట్లెత్తేశారు
సాక్షి ప్రతినిధి, బాపట్ల : చీరాల పచ్చనేత ఇసుక అక్రమ వ్యాపారం జోరందుకుంది. కూటమి సర్కారు వచ్చాక అడ్డు అదుపూ లేకుండా పోయింది. మరో వైపు బాపట్ల ఎంపీ అనుచరులు సైతం పోటీ పడడంతో ఇరువర్గాల మధ్య గొడవలు చెలరేగాయి. ఎంపీ అనుచరుల క్వారీలో ఉన్న యంత్రాన్ని చీరాల పచ్చనేత అనుచరులు తగలబెట్టారు. ఉన్నతాధికారుల జోక్యంతో ఓ ఇరవై రోజులపాటు తాత్కాలిక విరామమిచ్చిన పచ్చనేత తిరిగి అక్రమ తరలింపు మొదలు పెట్టారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లె శివారు ఎస్టీ కాలనీ వద్ద ఉన్న అసైన్డ్ భూముల్లోని ఇసుక దిబ్బల నుంచి పచ్చనేత ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారు. వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణానికి అమ్ముతున్నారు. చీరాల, బాపట్ల, పర్చూరు నియోజకవర్గాల పరిధిలో భవన నిర్మాణాలు, రియల్ వెంచర్లలో రోడ్లు, ప్లాట్ల చదును కోసం విక్రస్తున్నారు.
పచ్చనేత వాహనాలకు రైట్ రైట్..
చీరాల ప్రాంతంలో తాను మినహా వేరెవరూ ఇసుకను విక్రయించేందుకు వీలులేదని హుకుం జారీ చేయడంతో వేటపాలెం మండల అధికారులు పచ్చనేత ఇసుక వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలిన వారికి ఇసుక దిబ్బలు ఉన్నా, అమ్ముకోవడానికి వీలులేదు. కాదు కూడదని తరలించే ప్రయత్నం చేసినా వేటపాలెం తహసీల్దారు, పోలీసులు ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నారు. చీరాల ప్రాంతంలో పచ్చనేత ఒక్కరే అక్రమ రవాణా చేస్తుండడంతో ఇసుకకు మరింత డిమాండ్ పెరిగింది. టిప్పర్ ఇసుక రూ.20 వేల నుంచి రూ. 25 వేలకు అమ్ముతున్నారు. ట్రాక్టర్ రూ. 5 వేలకు తగ్గకుండా విక్రయిస్తున్నారు. పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నారు.
జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం :
పందిళ్లపల్లె శివారు ఎస్టీ కాలనీ వద్ద ఉన్న అసైన్డ్ భూముల్లోని ఇసుక దిబ్బల నుంచే ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. దీనికి సమీపంలోనే పుల్లరిపాలెం తాగునీటి పథకం ఉంది. పుల్లరిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో కొత్తరెడ్డిపాలెం, బచ్చులవారిపాలెం, ఊటుకూరిసుబ్బయ్యపాలెం, రామచంద్రాపురంతో పాటు ఎస్టీ కాలనీలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటికీ ఇక్కడున్న తాగునీటి పథకం నుంచే మంచి నీరు అందుతుంది.
ఇసుక అక్రమ తవ్వకాలతో తాగునీరు కూడా అందక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని, చర్యలు తీసుకోవాలని ఎస్టీ కాలనీ వాసులు గత ఏడాది అక్టోబర్‌లో జాతీయ ఎస్టీ కమిషన్‌కు రెండు మార్లు ఫిర్యాదులు చేశారు. అంతకుముందు జిల్లా ఉన్నతాధికారులకు సైతం పలుమార్లు విన్నవించారు. దీనిపై విచారించి తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు బాపట్ల జిల్లా కలెక్టర్‌కు సైతం ఎస్టీ కమిషన్ సూచిందింది. మితిమీరిన ఒత్తిళ్లతోనే చీరాల పచ్చనేత అక్రమ ఇసుక వ్యాపారాన్ని అడ్డుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
పందిళ్లపల్లె శివారు నుంచి తరలింపు
అసైన్డ్ భూముల నుంచి తవ్వకాలు
వాడరేవు రోడ్డు నిర్మాణంతోపాటు
ఇతర అవసరాలకు ..
ఆగని పచ్చనేత ఇసుక దందా
పట్టించుకోని ఉన్నతాధికారులు
గేట్లెత్తేశారు
Comments
Please login to add a commentAdd a comment