పటిష్ట బందోబస్తు
అద్దంకి: అధికారులంతా సమస్వయంతో పనిచేసి రాష్ట్రంలోనే పేరుగాంచిన శింగరకొండ తిరునాళ్లను విజయవంతం చేయాలని చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు కోరారు. ఈవో కార్యాలయంలో గురువారం ఆర్డీఓ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈఓ తిమ్మనాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్డీఓ మాట్లాడారు. ఈనెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ 70వ వార్షిక తిరునాళ్ల నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాన తిరునాళ్ల ఈనెల 14న జరుగుతుందన్నారు. ఆ రోజు వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా పంచాయతీరాజ్, మునిసిపల్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలు చూడాలని చెప్పారు. దారిలో అక్కడక్కడా తాగునీటిని ట్యాంకుల ద్వారా అందుబాటులో ఉంచా లని చెప్పారు. ఎక్కడ ఏముందో తెలిపే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయనునన్నట్లు చెప్పారు. అధికారులకు మూడు రోజులపాటు అన్నప్రసాదం దేవస్థానం తరఫున ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళలు, పురుషులకు విడివిడిగా బయో టాయిలెట్స్ ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. వృద్ధులకు, వికలాంగులకు వీల్‌చైర్‌తో దర్శనం, డ్యూటీ లో ఉండే అఽధికారులకు పాస్‌లజారీ, విద్యుత్ శాఖవారి సహకారంతో నిరంతరాయ విద్యుత్ సరఫరా, లైటింగ్ ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ, తాత్కాలిక బస్‌స్టేషన్, అక్కడ డిస్‌ప్లేతో ఏర్పాటుచేస్తామని చెప్పా రు. అన్ని శాఖలు నిర్వహించాల్సిన కార్యక్రమాలను తెలియజేశారు. ఈనెల 11వ తేదీ సాయంత్రం విజిట్ ఉంటుందన్నారు.
ప్రత్యేక వసతులు
ఈఓ తిమ్మనాయుడు మాట్లాడుతూ తిరునాళ్ల రోజున భక్తులకు ఉచిత దర్శనంతోపాటు, రూ.50, రూ.100 ప్రత్యేక దర్శనాలను ఏర్పాటు చేయనున్నుట్లు వెల్లడించారు. ఉచిత ప్రసాద పంపిణీ, చంటి పిల్లలకు పాలిచ్చే ప్రత్యేక వసతులు ఉంటాయని చెప్పారు. అన్ని శాఖల అధికారులకు ప్రత్యేక స్టాల్స్ దేవస్థానం ముందు భాగంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పై దేవస్థానం తరఫున కొండమీదకు ఉచిత బస్సులు, దారి పొడవునా లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తిరునాళ్లను విజయవంతం చేయండి
ఆర్డీఓ చంద్రశేఖర్‌నాయుడు
ఆధునాతన టెక్నాలజీ వినియోగం
సీసీ కెమెరాలు, డ్రోన్‌లతో పర్యవేక్షణ
అధికారులకు వాట్సప్ గ్రూప్ ఏర్పాటు
వృద్ధులు, వికలాంగులకు వీల్‌చైర్‌తో దర్శనం
ప్రభలపై అశ్లీల నృత్యాలు, ట్రాక్టర్లు,
అత్యధిక మైక్‌లు, డీజేలు నిషేధం
రాత్రి ఒంటి గంట వరకే సాంస్కృతిక కార్యక్రమాలు
2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
డీఎస్పీ మొయిన్ మాట్లాడుతూ తిరునాళ్ల రోజున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సంతమాగులూరు అడ్డరోడ్డు, పైలాన్, రేణింగవరం వద్ద అద్దంకి వైపు వాహనాలు రాకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నట్లు చెప్పారు. తప్పిపోయిన వారి అనౌన్స్‌మెంట్ కోసం దేవస్థానం తరఫున ఒకటి, పోలీసు తరఫున ఒకటి అనౌన్స్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ట్రాఫిక్ సమస్య దృష్ట్యా భక్తులు ఆ ఒక్క రోజు సొంత వాహనాల్లో రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తిరునాళ్లకు భక్తులతో వచ్చే వాహనాలను నిలిపేందుకు పరిసరాల్లో పది పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాహనాలు అక్కడ ఉంచి కాలి నడకన తిరునాళ్ల జరిగే ప్రదేశానికి రావాలని చెప్పారు. తిరునాళ్లలో ఐదుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 50 మంది ఎస్సైలు, 700 మంది పోలీసు మందోబస్తు నిర్వహిస్తామని చెప్పారు. ప్రభలపై అశ్లీల నృత్యాలు, పరిసరాల్లో క్రాకర్స్ పేల్చడం, అధిక సంఖ్యలో మైకులు, డీజేలు ఏర్పాటు నిషేధించామని చెప్పారు. ప్రభలపై ఆ రోజు రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే కార్యక్రమాల నిర్వహణకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ప్రభల నిర్వాహకులు, దానిపై కార్యక్రమం చేసే ఆర్కెస్ట్రా బృందం, వాయిద్యకారులు తదితరులు ముందుగానే వారి పేర్లతో స్టేషన్‌లో తెలియజేసి అనుమతి పొందాలని చెప్పారు. సమావేశంలో ఎంపీడీవో సింగయ్య, తహసీల్దార్ శ్రీ చరణ్, విద్యుత్‌శాఖ ఈఈ మస్తాన్‌రావు, ఆర్టీసీ డీఎం రామ్మోహన్‌రావు, సీఐ సుబ్బరాజు, మెడికల్, ఫైర్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పటిష్ట బందోబస్తు
Comments
Please login to add a commentAdd a comment