ప్రజా సంక్షేమానికి ప్రభుత్వాలు తూట్లు
నరసరావుపేట: ప్రజా సంక్షేమానికి, ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ప్రజలలో చైతన్యం నింపి పోరాటాలకు సిద్ధం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. గురువారం పల్నాడు జిల్లా కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశం కమిటీ సభ్యులు జి.రవిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ మోదీ వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. బీజేపీతో కూడిన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు సూపర్ సిక్స్ అంటూ విస్తృతంగా ప్రచారం చేశారని తెలిపారు. ఇప్పుడు అమలు చేయలేక పోతున్నామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన 23 వేల అర్జీల విషయంలో కాలయాపన వీడి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రజా చైతన్య యాత్రల ద్వారా ప్రజా సమస్యలను అధ్యయనం చేసి ఈ నెల 20 నుంచి జిల్లా కలెక్టరేట్లు వద్ద, రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలన్నారు. పార్టీ సీనియర్ నాయకులు గద్దె చలమయ్య, పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు వై.రాధాకృష్ణ, అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, ఏపూరి గోపాలరావు, తిమ్మిశెట్టి హనుమంతరావు, తెలకపల్లి శ్రీను, ఎస్.ఆంజనేయ నాయక్, మహిళా నాయకులు ఉమశ్రీ, మల్లీశ్వరి, విమల, రజిని, దుర్గాబాయి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment