● ఎంబీఏ చదువుతున్న వ్యక్తికి ఇన్విజిలేటర్ బాధ్యతలు ● సంజాయిషీ కోరిన ఆర్‌ఐఓ
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇన్విజిలేటర్‌కు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన విద్యార్థిని గుంటూరులోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల హాస్టల్లో ఉండి చదువుతోంది. ఈనెల 3 నుంచి పొన్నూరు రోడ్డులోని ఓ ప్రైవేటు కళాశాల పరీక్షా కేంద్రంలో సీనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరవుతోంది. విద్యార్థిని పరీక్ష రాస్తున్న గది ఇన్విజిలేటర్‌గా వ్యవహరిస్తున్న యువకుడు పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం, ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ అడగడం చేశాడు. దీంతో మనస్ధాపం చెందిన విద్యార్థిని తాను చదువుతున్న కళాశాల యాజమాన్యం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. కళాశాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడిని రెండు రోజుల క్రితం పోలీసులు తీవ్రంగా మందలించారు. అదే రోజు అతన్ని ఇన్విజిలేషన్ విధుల నుంచి అధికారులు తొలగించారు. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు చీఫ్ సూపరింటెండెంట్‌తోపాటు కళాశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడి యువకుడిని కళాశాలకు పిలిపించారు. అతడికి దేహశుద్ధి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో ఓ ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ చదువుతున్న వ్యక్తిని అధికారులు ఇన్విజిలేటర్‌గా నియమించడం గమనార్హం. ఈ విషయం ఆర్‌ఐవో జీకే జుబేర్ దృష్టికి వెళ్లడంతో ఎంబీఏ విద్యార్థిని ఇన్విజిలేటర్‌గా నియమించడంపై చీఫ్ సూపరిండెంట్‌ను సంజాయిషీ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment