పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
భయమే కాటేసింది
మార్టూరు: మనోవేదనతో పాటు భయం వల్ల ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని వలపర్ల గ్రామంలో శనివారం వెలుగు చూసింది. వలపర్ల ఎస్సీ కాలనీకి చెందిన తాళ్లూరి చిన్న పౌలు (36) తన భార్యతో కలిసి రెండు నెలలుగా నెల్లూరు జిల్లాలో పొగాకు పనుల నిమిత్తం వెళ్లారు. అతను చాలా కాలంగా మానసిక వ్యాధితో బాధ పడుతూ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో చిన్న పౌలు అనారోగ్యం బారిన పడటంతో భార్య నాలుగు రోజుల కిందట వలపర్ల తీసుకొని వచ్చి వైద్యులకు చూపించగా పసికర్ల వ్యాధిగా గుర్తించి చికిత్స చేస్తున్నారు. రెండు రోజుల కిందట చిన్న పౌలు భార్యతో కలిసి బల్లికురవ మండలం లోని కొణిదెనలో గల ఆమె పుట్టింటికి వెళ్లారు. శుక్రవారం ఒక్కడే బైకుపై వలపర్ల వచ్చి ఇంట్లో ఉన్న బంగారు ఉంగరాన్ని స్థానికంగా తాకట్టు పెట్టి పదివేలు అప్పు తీసుకున్నాడు. అందులో ఐదు వేల రూపాయలు తన తల్లికి ఇచ్చి మిగిలిన రూ. 5 వేలు తనవద్ద ఉంచుకొని గ్రామంలో మద్యంతో పాటు నువాక్రాన్ పురుగుల మందు కొనుగోలు చేశాడు. శుక్రవారం రాత్రి సమీప గ్రామమైన నాగరాజు పల్లి పొలాల్లోకి వెళ్లి రెండూ కలుపుకుని తాగాడు. కొంతకాలంగా భార్యతో.. తనకు భయంగా ఉంటోందని ఆత్మహత్య చేసుకుని చనిపోదామని అనిపిస్తుందనేవాడు. భర్త ప్రవర్తన పట్ల అనుమానంగా ఉన్న అతని భార్య శుక్రవారం వలపర్ల వచ్చి బంధువులతో కలిసి చిన్న పౌలు ఆచూకీ కోసం వెతికినా ఫలితం కనిపించలేదు. శనివారం ఉదయం చిన్న పౌలు మృతదేహాన్ని గుర్తించిన పొలం యజమాని సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిన్న పౌలు మృతదేహాన్ని మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి ఇద్దరు మగ పిల్లలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment