అంగన్‌వాడీలపై సర్కారు ద్వంద్వ వైఖరి
లక్ష్మీపురం: అంగన్‌వాడీల విషయంలో కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ ధ్వజమెత్తారు. స్థానిక బ్రాడీపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూటమి నాయకులు అంగన్‌వాడీల సమ్మె శిబిరాలలో ప్రత్యక్షంగా పాల్గొని పోరాటానికి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా జీతాల పెంపు పట్టించుకోవడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం మార్చి 10వ తేదీన విజయవాడలో ధర్నా నిర్వహించనున్నట్లు ముందుగానే అధికారులు, మంత్రులకు యూనియన్ వినతి పత్రాలు ఇచ్చిందన్నారు. అయినప్పటికీ ధర్నాను భగ్నం చేసేందుకు అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా సెక్టార్లవారీగా ట్రైనింగులు ఉంటాయని, దానికి హాజరు కాకపోతే తీవ్ర చర్యలు చేపడతామని హెచ్చరికలు జారీ చేయడం, యూనియన్ నాయకుల గృహనిర్బంధాలు, అరెస్టులు ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని చెప్పారు. ఇలాంటి నిర్బంధాలు కొత్త కాదని, వాటన్నింటినీ అధిగమించి పోరాటం చేయగల సత్తా అంగన్‌వాడీలకు ఉందని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను కట్టిపెట్టి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారిపై నిర్బంధం ప్రయోగిస్తే పోరాడే అంగన్‌వాడీలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. సమ్మె ముగింపు సందర్భంగా ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలోనూ తూట్లు పొడుస్తున్నారని తెలిపారు. ఒప్పందంలో మట్టి ఖర్చులు రూ.20వేలు ఇవ్వాలని ఉంటే దాన్ని రూ.15 వేలకు కుదించి జీవో ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. అలాగే రిటైర్మెంట్ సర్వీసు పరిహారం కింది అంగన్‌వాడీలకు రూ.1.20 లక్షలు, హెల్పర్లకు రూ.60 వేలు ఇవ్వాలని ఒప్పందంలో ఉంటే దాన్ని రూ. 20 వేల వంతున తగ్గించారన్నారు. మళ్లీ పేరు మార్చి గ్రాట్యూటీ అని చెబుతూ దానితోనే సంబరపడమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ చార్జీల పెంపుదల, ప్రమోషన్లు తదితర విషయాలపై ఏర్పాటు చేసిన కమిటీని పక్కన పెట్టేశారని విమర్శించారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ
Comments
Please login to add a commentAdd a comment