ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకర జీవనం
జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వాణిశ్రీ వెల్లడి
బల్లికురవ: ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలతో ప్రజలు ఆరోగ్యంగా జీవించడంతో పాటు భూమి సారవంతంగా ఉంటుందని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వి. వాణిశ్రీ తెలిపారు. సోమవారం ఆమె బల్లికురవ, నక్కబొక్కలపాడు, చెన్నుపల్లి గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయా గ్రామాల్లో స్వయం సహాయక సంఘ సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. గ్రామ సంఘ సమావేశాల్లో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంపొందించాని తెలిపారు. గ్రామాల వారీగా ప్రకృతి వ్యవసాయ సాగును పెంచాలని చెప్పారు. పురుగుమందులు అవశేషాలు లేని ఆహార పదార్థాలు పండిస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విచక్షణా రహితంగా ఎరువులు, పురుగు మందులు వాడటంతో భూములు నిస్సారం కావడంతో పాటు పెట్టుబడులూ పెరుగుతాయని చెప్పారు. గ్రామాల వారీగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, పర్యవేక్షించేందుకు యూనిట్ ఇన్‌చార్జులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, ఐసీఆర్‌పీలను ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. కార్యక్రమంలో జైన్ క్రాప్ ప్రతినిధి ప్రతిమ, రాష్ట్ర రైతు సాధికార సంస్థ ప్రతినిధి సౌమ్య, అడిషన్ డీపీఎం మోహన్, ఎన్‌ఎంఏలు చందన, దుర్గ, మాస్టర్ ట్రైనర్ అప్పారావు, యూనిట్ ఇన్‌చార్జులు కల్పన, నాగాంజలి, నాగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment